ఆడికృత్తిక: సుబ్రహ్మణ్యునికి ప్రీతిపాత్రమైన రోజు ఆడికృత్తిక

 

ఆషాఢ మాసంలో కృత్తికా నక్షత్రం వచ్చే రోజుని ఆఢి కృత్తిక అంటారు. ఇది సుబ్రహ్మణ్యేశ్వరునికి అత్యంత ప్రీతికరమైన రోజు.   తమిళనాడులో ఆడి కృత్తిక పర్వదినాన్నివిశేషంగా జరుపుకుంటారు. మిగతా నెలల్లో కృత్తిక నక్షత్రం వచ్చిన రోజుల్లో సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసినా ఫలితం ఉంటుంది. కానీ ఆఢికృత్తిక రోజు స్వామిని ఆరాధిస్తే విశేషఫలితం ఉంటుందని భక్తుల నమ్మకం.

స్వామి భక్తులు ఈరోజు సూర్యోదయానికంటే ముందే నిద్ర లేచి శుచియై తరువాత చలిమిడితో ప్రమిద చేసి అందులో ఆవు నేతితో మూడు వత్తుల దీపం వెలిగి౦చాలి. ఈ దీపాన్ని శివుడు, పార్వతీ దేవి, వినాయకుడు, సుబ్రహ్మణ్యుడు ఉన్న చిత్రపటం ముందు వెలిగించి చిమ్మిలి, పచ్చి పాలు, వడపప్పు, అరటి పండ్లు, తాంబూలం ఇవన్నీ నివేదించాలి. సుబ్రహ్మణ్యుని స్తోత్ర పారాయణ చేసి, సుబ్రహ్మణ్య జన్మ వృతాంతం చదువుకుని, సాయంత్రం వరకూ ఉపవాసం ఉండి సాయంత్రం నక్షత్ర దర్శనం చేసుకుని ప్రసాదముగా పిండి దీపము, చిమ్మిలి, వడపప్పు, అరటి పండ్లు స్వీకరి౦చాలి.

ముందు రోజు రాత్రి ఇంకా ఆ రోజు రాత్రి కూడా బ్రహ్మచర్యం పాటించాలి. ఇలా చేయడం వలన సుబ్రహ్మణ్య స్వామి వారి విశేష అనుగ్రహం కలుగుతుంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. మందమతులు, జడులు, మతి స్థిమితం సరిగ్గా లేని పిల్లలకు ఈ పూజ అమృత తుల్యంగా పనిచేస్తుంది. అందరికీ జ్ఞానం కలుగుతుంది. సుబ్రహ్మణ్యుడు ఉత్తమమైన జ్ఞానం కలిగిస్తాడు. 

ఆఢి కృత్తిక విశేష౦

అసలు ఎందుకు ఈ కృత్తికకు అంత ప్రత్యేకతో తెలుసుకుందాం. తమిళులకు ఏ మాసమైన పౌర్ణమి రోజుతో మొదలవుతుంది, కనుక ఆషాడ పౌర్ణమి నుండి వారికి ఆషాడ మాసం ప్రారంభమయ్యిందన్నమాట. మనకు ఆషాడ మాసంలో బహుళ ఏకాదశి నుండి దక్షిణాయనం ప్రారంభమవుతుంది, అదే తమిళులకు తొలి శుద్ధ ఏకాదశి అన్నమాట. అంతేకాదు దక్షిణాయనం ముఖ్యంగా పితృ దేవతల ఆరాధనకు ప్రీతికరమైనది. పార్వతీ దేవి సుబ్రహ్మణ్యుని మాతృకలైన కృత్తికలకు ఏ మాసంలోనైనా కృత్తికా నక్షత్రం రోజున ఎవరైతే సుబ్రహ్మణ్య స్వామివారిని ఆరాధిస్తారో వారికి సుబ్రహ్మణ్యుని సంపూర్ణ అనుగ్రహం కలుగుతుందని వరం ప్రసాదించిందట. అందులోనూ దక్షిణాయనానికి ముందు వచ్చే కృత్తిక గనుక దీనిని ఆది కృత్తిక అనీ, ఆషాడ మాసంలో వచ్చేది కనుక ఆఢి కృత్తిక అనీ కూడా అంటుంటారు. అందుకే ఆషాడ ఆఢి కృత్తిక సుబ్రహ్మణ్యుని ఆరాధనకు అత్యంత శ్రేయస్కరమైనది.

ఆది కృత్తిక రోజున ఎవరైనా వేదవిదునికి అందునా బాల బ్రహ్మచారి అయిన వేదవిదునికి  షడ్రసోపేతమైన భోజనం పెట్టి, ఎర్రటి పంచ, కండువా, శక్తిమేరకు దక్షిణ, తాంబూలం, అరటి పండ్లు, గొడుగు, పాదరక్షలు, రాగి చెంబు( లేదా పంచపాత్ర ఉద్దరిణ, అర్ఘ్య పాత్ర ) సమర్పించి, ఆయనే సుబ్రహ్మణ్యునిగా భావించి ఆశీర్వచనం తీసుకుంటే విశేష ఫలితం కలుగుతుందని భక్తుల నమ్మకం. ఒకవేళ బాల బ్రహ్మచారియైన వేద విధుడు లేక గృహస్తు అయిన వేద విధుడు లభించకపోతే మధ్యాహ్న సమయంలో ఎవరికైన ఆకలితో ఉన్నవారికి కడుపు నిండుగా ఆహరం పెట్టినా మంచిదే. ఒకవేళ అటువంటి వ్యక్తి కూడా లభించకపోతే పశు పక్షాదులకు ఆహరం సమర్పించి సుబ్రహ్మణ్యుని ప్రార్ధించినా ఉత్తమ ఫలితం ఉంటుంది. కనుక వీలైన వారందరూ తమ శక్తివంచన లేకుండా సుబ్రహ్మణ్య స్వామి వారిని ఈ రోజు ఆరాధించండి.