కుంభకోణం: కుంభం నుంచి అమృతం వెలువడిన ప్రదేశం

దేవాలయాలకు నిలయమైన తమిళనాడులో ముఖ్యమైన నగరాలలో తంజావూరు జిల్లాలో కుంభకోణం ఒకటి. ఇది చెన్నైకి దక్షిణాన 270 కిలోమీటర్ల దూరంలో వెలసింది. కుంభకోణానికి ఉత్తరాన కావేరి నది, దక్షిణాన అరనలారు నది ప్రవహిస్తున్నాయి. 

ఈ కుంభకోణం అనబడే ఊరిని కుడందై అనేవారని చరిత్రకారులు చెబుతున్నారు. ఈ ఊరు ఎంతో పురాతనమైనది. 

కుంభకోణం అనే పేరు ఎలా వచ్చిందంటే...

ప్రళయకాలంలో ఉప్పెన వచ్చి సర్వజగత్తు మునిగిపోయే పరిస్థితి ఏర్పడింది. ప్రళయం తర్వాత మళ్ళీ సృష్టించే కార్యక్రమం మొదలెట్టడానికి కావలసిన పరికరాలు మరియు సృష్టికి కావలసిన అమృతం మొదలైన వాటిని ఒక కుంభంలో ఉంచి ఒక పర్వతంపై ఉంచాడు బ్రహ్మ. ఉప్పెన పొంగడం వల్ల పర్వత శిఖరంపై ఉంచిన కుంభం కూడా ఉప్పెనలో చిక్కుకుని అక్కడి నుంచి మరొక చోటికి చేరుకుంది.

ఉప్పెన తగ్గిన తర్వాత దేవతలు, మునులు వేడుకోలు ప్రకారం శివుడు ఒక కిరాతకుడు వేషంలో అవతరించాడు. ఆయన వదిలిన బాణము కుంభాన్ని విరిచింది. విరిగిన కుంభం నుండి బయట పడిన అమృతం రెండు ధారలుగా ప్రవహించి ఒకటి స్వర్ణ తామర కొలనులోకి మరొకటి మహామఖం కొలనులోకి ప్రవహించాయి. 

బ్రహ్మ సృష్టి ప్రారంభం ఇక్కడే...

బ్రహ్మ తన సృష్టికర్మను మొదలుపెట్టాడు. కుంభం నుంచి అమృతం ప్రవహించిన ఊరినే కుంభకోణం అని పిలుస్తున్నారు. 

ప్రళయం తర్వాత ఈ కుడందై అనబడే కుంభకోణంలోనే బ్రహ్మ తన సృష్టి కార్యక్రమాలను మొదలుపెట్టాడని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈ కుంభకోణంలో చతుర్ముఖుడైన బ్రహ్మకు ఒక ఆలయం వెలసింది. కుంభం నుండి ఒక కొబ్బరికాయ, పవిత్రమైన దర్భ, దారము, బిల్వపత్రం మరియు కుంభానికి కింద ఉంచే చుట్టుకుదురు లాంటివి ఉప్పెన సమయంలో వీచిన గాలివల్ల ఎగిరి ఐదు ప్రదేశాలలో పడ్డాయి. అవి ఐదు లింగాలుగా ఉద్భవించాయి. ఆ ప్రదేశాలలో ఐదు శివాలయాలు వెలిసాయి. 

కుంభకోణంలో మాత్రమే సుమారు 188 ఆలయాలు నెలకొన్నాయి. ఇవి ఇక్కడి ప్రజల మనసుల్లోనూ, ఈ నగరాన్ని దర్శించడానికి వచ్చే భక్తుల మనసుల్లోనూ ఆధ్యాత్మిక చింతనను పెంచగలవు.

ఈ నగరం చుట్టూ ఉన్న గ్రామాల్లోనూ, చిన్న పల్లెల్లోనూ గొప్ప ఆలయాలున్నాయి. 

కుంభేశ్వర ఆలయం

నగరం మధ్యలో కొలువైన బ్రహ్మండమైన ఆలయం కుంభేశ్వర ఆలయం. ఇక్కడున్న శివుని ఆది కుంభేశ్వరునిగాను, క్షేత్రనాయకిగా మంగళాదేవిని పూజిస్తారు. ఇది ఈ నగరంలో అతి ప్రాచీనమైనది. 

బ్రహ్మ ప్రతిష్ఠ చేసిన ఈ ఆలయం గురించి తిరుజ్ఞాన సంబందర్, నావుక్కరసర్ అనబడే తమిళ శైవ భక్తులు తమ గ్రంథాలలో స్తుతించారు. మూడు ప్రాకారాలు, మూడు దిక్కుల్లోనూ గోపురాలతో నాయక రాజవంశంలోని రాజులు ఎంతో అద్భుతంగా నిర్మించిన ఆలయం ఉంది. బయటి ప్రాకారంలో కుంభముని సిద్ధుడు(యోగి) ధ్యానంలో నిమగ్నమై ఉన్నట్టు కొలువు తీర్చారు. 

ఆలయమంతా శిల్పకళా నైపుణ్యం ప్రతిఫలించే స్తంభాలు, శిల్ప మండపాలు ఆకర్షణీయంగా కనిపిస్తాయి. నవరాత్రి మండపంలో  12 రాశులకు, 27 నక్షత్రాలకు వాటి రూపాలతో శిల్పాలు చెక్కాంచారు. ఆలయంలో రాతితో చేయబడిన రెండు నాదస్వరాలను చూడగలం. 

నాగేశ్వరస్వామి ఆలయం

పెరియనాయకి అమ్మవారితో ఉన్న నటరాజస్వామికి నిర్మించిన బ్రహ్మాండమైన ఆలయం ఇది. సూర్యభగవానుని పూజించి వరం పొందడం వల్ల ఆలయం తీర్థకొలను, సూర్యపుష్కరిణిగా పిలువబడుతోంది. ఆదిశేషుడు ఇక్కడ స్వామిని పూజించి గొప్ప శక్తులను పొందాడు. 

అమృత కుంభం నుండి వెలువడిన బిల్వపత్రం లింగంలా మారడం వల్ల ఈ ప్రదేశాన్ని బిల్వవనం అని అంటారు. 

రథ ఆకారంలో వెలసిన ఈ నాగేశ్వరస్వామి ఆలయం అద్భుత శిల్పకళకు పుట్టినిల్లు అనడానికి నిదర్శనంగా కొన్ని మెట్లు ఎక్కిన తర్వాత ఉన్న మండపంలో రాతితో చేసిన 12 రాశులు, 12 గుఱ్ఱాలు, నాలుగు ఏనుగులు అద్భుత కళాఖండాలు.

సోమనాథస్వామి ఆలయం

సోమనాథస్వామి ఆలయం స్వర్ణతామర పువ్వుల కొలను సమీపంలోఉంది. ఈ ఆలయంలోని దేవి స్వర్ణనాయకీదేవి. చంద్రుడు పూజించినందున శివుని సోమనాధస్వామి అనే పేరు వచ్చింది. 

కుంభం నుండి చుట్టుకుదరపడ్డ ఈ క్షేత్రం గురించి జ్ఞాన సంబందర్ అనే శైవభక్తుడు రాసిన పాటల్లో వర్ణించారు. అభిముఖేశ్వర ఆలయం మహామఖ కొలనుకు తూర్పున ఉంది. కుంభం నుండి కొబ్బరికాయ పడిన చోటు ఇది అందుకే ఈ క్షేత్రంలోని స్వామిని నారికేశ్వరస్వామి అని పిలుస్తారు. అమ్మవారి పేరు అమృతవల్లీదేవి. 

దర్శించాల్సిన ముఖ్యమైన శివక్షేత్రాలు బానపురీశ్వరస్వామి కౌత్మేశ్వరస్వామి, కోటీశ్వరస్వామి, అమృతకళసనాథస్వామి, ఏకాంబరేశ్వరస్వామి ఆలయాలు.

సారంగపాణి ఆలయం

కుంభకోణంలో ఉన్న వైష్ణవ ఆలయాలలో ముఖ్యమైనది సారంగపాణి ఆలయం. ఏడుగురు ఆళ్వారులు 58 పాటలు పాడిన క్షేత్రం ఇది. అమ్మవారు కోమలవళ్ళిదేవి. 

మహాలక్ష్మి, హేమర్షికి కూతురికి జన్మించిన కోమల వళ్ళికి విష్ణువుతో వివాహం జరిగిందని పురాణాలు చెబుతున్నాయి. 

గర్భగుడిలో విష్ణువు తూర్పముఖాన శయనించినట్లు విగ్రహం భక్తులను రక్షించేవిధంగా కొలువయ్యాడని ప్రతీతి. శేషశయనంపై పవళించిన విష్ణువు ఎదుట కావేరి, సింధు మరియు గంగానదులు నమస్కరిస్తున్నట్టున్న చిత్రాలు విశేషంగా ఉంటాయి. విష్ణుమూర్తి ఇక్కడ అపర్యాప్త అమృతం అని పిలువబడుతున్నాడు. ఎంతసేపు దర్శించినా తనివితీరని రూపం.

ఈ ఆలయంలో అద్భుతమైన శిల్పాలు ఎన్నో ఉన్నాయి. రథానికున్న చక్రాలు రథం పైనున్న ఆలయాన్ని మోస్తున్నట్టు కనిపిస్తుంది. చైత్రమాసంలో ఈ స్వామికి జరిగే రథోత్సవం ఎంతో ప్రసిద్ధిచెందింది. 

చక్రపాణి ఆలయం

నాయకరాజులు కట్టించిన ఈ ఆలయం కావేరి ఒడ్డున చక్రతీర్థమెట్ల వద్ద వెలసింది. చక్రపాణిని సారంగపాణి స్వామి అంటారు. అందుకే అన్ని ఉత్సవాలు ఇద్దరికి కలిపి జరుపుతారు. ఒకసారి సూర్యునికి తన కిరణాల ప్రకాశంపై గర్వం ఏర్పడింది. అప్పుడు విష్ణువు ఇక్కడ చక్రం రూపంలో దర్శనమిచ్చి సూర్యుని గర్వాన్ని అణచివేశాడట. 

రామస్వామి ఆలయం

దక్షిణ అయోధ్యగా పిలువబడే ఈ రామస్వామి ఆలయంలో మహిమండపం, రాజగోపురం, గర్భగుడి ఉన్నాయి. ఆలయం లోని రాముడు పట్టాభిషేకం జరిపినపుడు కనిపించినట్టు దర్శనమిస్తాడు. రాముడు, సీత ఒకే ఆసనంపై కూర్చున్నట్టున్న విగ్రహాలు పక్కనే బాణం చేత పట్టుకున్న లక్ష్మణుని విగ్రహం, భరతుడు గొడుగును పట్టుకొనగా, శతృఘ్నుడు చామరం వీస్తున్నట్టు ఉంటుంది ఆ మూర్తి. ఎక్కడా కనిపించని విధంగా ఆంజనేయస్వామి చేత వీణబూని దర్శనమిస్తాడు. మరొకచేత పుస్తకము, రామాయణ పారాయణం చేస్తున్నట్టున్న విగ్రహం. ఆలయంలోని అతి పెద్ద స్తంభాలపై మీనాక్షి కళ్యాణం, వామన అవతారం మొదలైన పురాణ దృశ్యాలున్న శిల్పాలు చెక్కారు. ప్రాకారంలో రామాయణ దృశ్యాల రంగు రంగుల చిత్రాలు కనిపిస్తాయి. 

ఇతర విష్ణు ఆలయాలు

కుంభకోణంలోని ఇతర విష్ణు ఆలయాలు వరాహేశ్వరస్వామి ఆలయం, రాజగోపాలస్వామి ఆలయం, వేదనారాయణస్వామి ఆలయం, వరదరాజస్వామి ఆలయం మొదలైనవి. 

ఇంతేకాక నగరంలో కాళికాదేవి, అరియలూర్ మారియమ్మన్, వినాయకుని ఆలయం, ఆంజనేయస్వామి ఆలయం, వీరభద్ర స్వామి ఆలయం మొదలైన ఎన్నో ఆలయాలను నిర్మించారు. 

పట్టుచీరలకు ప్రసిద్ధి

ఈనాటి కుంభకోణం పట్టుచీరలకు, ఇత్తడిపాత్రలకు, పూజకు ఉపయోగించే సామాగ్రికి ప్రసిద్ధిచెందింది. కుంభకోణం తమలపాకులు భారతదేశంలోనే ఎంతో ప్రసిద్ధిగాంచినవి. ఇక్కడ పెరిగే తమలపాకులు అన్నిప్రాంతాలలో పెరిగిన వాటికంటే ఎంతో రుచిగాను, వాసనతోనూ ఉంటాయి.