తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో శనివారం బుగ్గోత్సవం ఘనంగా ప్రారంభమైంది. మూడు రోజుల పాటు జరుగనున్న ఈ ఉత్సవంలో మొదటిరోజు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.
ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి విశ్వరూప దర్శనం కల్పించారు. అనంతరం శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలోని బుగ్గ వద్దకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవారిని వేంచేపు చేశారు. మధ్యాహ్నం 2.30 గంటలకు స్వామి,అమ్మవార్ల ఉత్సవర్లకు స్నపనతిరుమంజనం, సమర్పణ, ఆస్థానం నిర్వహించారు.
సాయంత్రం 5.30 గంటలకు ఉభయనాంచారులతో కలసి శ్రీవారి ఊంజలసేవ, అనంతరం బుగ్గ వద్దకు ఊరేగి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు . సాయంత్రం 6 గంటలకు శ్రీ మహలక్ష్మీ అమ్మవారి ఆలయం వద్ద ఆస్థానం నిర్వహించారు.