శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో మంగళవారం ఉదయం శ్రీనివాసుడు శ్రీరాములు వారి అలంకారంలో హనుమంత వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు.
ఉదయం 8 గంటలకు స్వామివారు నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులను కటాక్షించారు. వాహనసేవ ముందు గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి ఉత్సవం కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.
మధ్యాహ్నం 2 నుండి 3 గంటల వరకు శ్రీవారి కల్యాణమండపంలో వసంతోత్సవం ఘనంగా నిర్వహించనున్నారు. అనంతరం సాయంత్రం 4 నుండి 5 గంటల వరకు స్వర్ణ రథోత్సవము వైభవంగా జరుగనుంది. రాత్రి 7 నుండి 8 గంటల వరకు గజవాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు.