రథసప్తమి సందర్భంగా ఫిబ్రవరి 16వ తేదీన తిరుమలలో సూర్యజయంతి వేడుకలు జరుగనున్నాయి. ఈ సందర్భంగా ఏడు వాహనాలపై స్వామివారు ఆలయ మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు.
పవిత్రమైన మాఘ మాసంలో శుక్ల పక్ష సప్తమి తిథిని రథసప్తమి లేదా మాఘ సప్తమి అని పిలుస్తారు. ఈ పరమ పవిత్రమైన రోజున శ్రీ సూర్యదేవుడు జన్మించాడని, ప్రపంచం మొత్తానికి జ్ఞానం ప్రసాదించాడని వేదాల ద్వారా తెలుస్తోంది. రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకొని భారీ సంఖ్యలో తిరుమలకు విచ్చేసే భక్తుల కోసం టీటీడీ విస్తృతమైన ఏర్పాట్లు చేస్తోంది. రథసప్తమి రోజున ఒకరోజు బ్రహ్మోత్సవాలు కూడా అంగ రంగ వైభవంగా నిర్వహిస్తారు.
వాహనసేవల వివరాలు
- తెల్లవారుజామున 5.30 నుంచి 8 గంటల వరకు(సూర్యోదయం ఉదయం 6.40 గంటలకు) – సూర్యప్రభ వాహనం
- ఉదయం 9 నుంచి 10 గంటల వరకు – చిన్నశేష వాహనం
- ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు – గరుడ వాహనం
- మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల వరకు – హనుమంత వాహనం
- మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు – చక్రస్నానం
- సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు – కల్పవృక్ష వాహనం
- సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు – సర్వభూపాల వాహనం
- రాత్రి 8 నుంచి 9 గంటల వరకు – చంద్రప్రభ వాహనం