తెలుగు రాష్ద్రాల్లో చంద్ర గ్రహ క్షేత్రాలు

తెలుగు రాష్ట్రాలలో ఉన్న నవగ్రహ క్షేత్రాల గురించి తెలుసుకుందాం.   చాలామంది నవగ్రహ క్షేత్రాలకు వెళ్లాలంటే తమిళనాడు వెళ్లాలి, తమిళనాడులోనే నవగ్రహ క్షేత్రాలు చూడాలని చెబుతారు.   కానీ తెలుగు రాష్ట్రాలలో కూడా నవగ్రహ సంబంధిత క్షేత్రాలు చాలా ఉన్నాయి.  ఆయా క్షేత్రాలను దర్శిస్తే ఆయా గ్రహ దోషాలను కొంతవరకూ తగ్గించుకోవచ్చు. 

నవగ్రహాల్లో చంద్ర భగవానునికి సంబంధించిన క్షేత్రాలు

భీమవరం  

    పశ్చిమ గోదావరి జిల్లా గునిపూడిలో భీమారామ క్షేత్రం ఉంది.   ఇక్కడి శివలింగం పౌర్ణమి నాటికి తెలుపుగాను, అమావాస్య నాటికి నలుపుగాను మారుతూ ఉంటుంది.   గునిపూడిలో ఉన్న స్వామిని పూజిస్తే, మంచి ఫలితాలు కనిపిస్తాయి.  ఎవరైనా చంద్రగ్రహ దోషంతో  బాధపడుతున్నవారు పౌర్ణమికి గాని, అమావాస్యకి గాని ఈ ఆలయంలో శివునికి అభిషేకం చేయించుకుంటే చాలా మంచి ఫలితాలు వస్తాయి.   చంద్రుడికి అధిష్టాన దేవతగా శ్రీరాముడు,  శ్రీకృష్ణుడు,  శ్రీ మహాలక్ష్మిగా చెప్తారు.   ఎందుకంటే!  "శ్రీరామచంద్ర మహాప్రభో!!" అని పిలుస్తాం.  చంద్రుని నామం రామునిలోనే ఉంది.

శ్రీరామ క్షేత్రాలు

భద్రాచలం

భద్రాచలం తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం జిల్లాలో ఉంది.   దీనినే భద్రాద్రిగా కూడా పిలుస్తారు.   ఈ క్షేత్రాన్ని సోమవారం దర్శిస్తే మంచి ఫలితాలు కనిపిస్తాయి.   

ఒంటిమిట్ట

 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కడప జిల్లాలో ఈ క్షేత్రం ఉంది.   ఈ క్షేత్రంలో ఆంజనేయస్వామి ఆలయం బయట ఉంటారు.   

 రామతీర్థం

  విజయనగరం దగ్గర ఉన్న రామతీర్థం జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిన క్షేత్రం.   

 గొల్లల మామిడాడ

వైష్ణవ సాంప్రదాయం అనుసరించే రవిక్షేత్రం ఉంది.   ఈ క్షేత్రంలో శ్రీరామచంద్ర పట్టాభిస్వామి ఉన్నారు.   ఎత్తయిన పెద్ద గాలిగోపురం ఉంది.   ఇక్కడ శ్రీరామనవమికి ఉత్సవాలు జరుపుతారు.  ఈ క్షేత్రంలో వారంరోజుల పాటు స్వామివారికి బంగారు నగలు వేస్తారు.   ఆరోజుల్లోనే స్వామివారిని దర్శించుకుంటే మంచిది.   ఆ దర్శన భాగ్యం అందరికీ దక్కదు.  

శ్రీ కృష్ణుడి క్షేత్రాలు

 నెమలి

     కృష్ణాజిల్లా గంపలగూడెం మండలంలో శ్రీ కృష్ణుని క్షేత్రం ఉంది.   సోమవారం రోజు ఈ స్వామిని దర్శిస్తే మేలు కలుగుతుందని చెబుతారు.

  మొవ్వ

    మహాకవి క్షేత్రయ్య అర్చించి ఆరాధించిన క్షేత్రం.  ఇక్కడ కూడా శ్రీ కృష్ణుని దర్శించవచ్చు. 

హంసలదీవి

    కృష్ణానది, సముద్రంలో కలిసే చోటు (సాగర సంగమం) ఇక్కడ శ్రీ కృష్ణుని దేవస్థానం ఉంది. చాలామంది పండరీపురం వెళ్లి పండరినాథుని దర్శింప లేకపోయామే!! అని బాధపడతారు.   పండరీనాథుని దర్శించుకోలేనివారు మచిలీపట్నం దగ్గరలోనే,  కీర పండరీపురం  క్షేత్రాన్ని చూడవచ్చు.   పండరీపురంలో పండరీనాథుడు ఎలా ఉంటాడో!! కీర పండరీపురంలో కూడా స్వామి అలానే ఉంటారు. పండరీపురంలో జరిగిన విధంగానే ఇక్కడ కూడా స్వామికి  సేవలు జరుగుతూ ఉంటాయి.   మచిలీపట్నంలో సముద్ర స్నానం చేసి కీర పండరీపురం దర్శించుకుంటే చంద్రగ్రహ దోషాలు తగ్గుతాయి. 

 మహాలక్ష్మి క్షేత్రాలు   

విశాఖపట్నం

    విశాఖపట్నం కనకమహాలక్ష్మి దేవాలయం బురుజు పేటలో ఉంటుంది.   అమ్మవారికి శుక్రవారం ఉత్సవాలు చేస్తారు.   మార్గశిర మాసంలో అమ్మవారికి చేసే ఉత్సవాలు జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే.   స్వయంగా మనమే అభిషేకం చేసుకోవచ్చు.   కేవలం సేవా కార్యక్రమాలకే పూజారులు ఉంటారు.   

తిరుచానూరు

    తిరుపతిలోని తిరుచానూరులో కూడా మహాలక్ష్మి కొలువై ఉంది.   ఇంకా నరసింహ క్షేత్రాలన్నింటిలోనూ అమ్మవారు కొలువై ఉంటుంది.  ఎందుకంటే!!  నరసింహ క్షేత్రాలు లక్ష్మీ నరసింహ క్షేత్రాలుగా ప్రసిద్ధి.   వేదాద్రి, యాదాద్రి, వాడపల్లి, సింహాచలం ఇవన్నీ కూడా లక్ష్మీ క్షేత్రాలుగా దర్శించవచ్చు.  అంతేకాదు వెంకటేశ్వరస్వామి క్షేత్రాలైన తిరుమలగిరి,  తెనాలిలో కూడా లక్ష్మీదేవి కొలువై ఉంది. మంగళగిరిలోని పానకాల లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో, నరసింహస్వామి కొండ మీద ఉంటారు.   క్రింద లక్ష్మీ నరసింహస్వామి గుడిలో చక్కని లక్ష్మీదేవి విగ్రహం పెద్దది ఉంటుంది.  చంద్ర గ్రహ దోషాలతో బాధపడేవారు ఈ క్షేత్రాలను దర్శించినట్లయితే మేలు కలుగుతుందని పండితులు చెబుతున్నారు.