నవగ్రహ దోషాలు తగ్గించుకోవడానికి చాలామంది తమిళనాడు వెళ్లాలి, తమిళనాడులోనే నవగ్రహ క్షేత్రాలు ఉన్నాయని చెబుతారు. కానీ తెలుగు రాష్ట్రాలలో కూడా నవగ్రహ సంబంధిత క్షేత్రాలు చాలా ఉన్నాయి. తెలుగు రాష్ట్రాలలో ఉన్న నవగ్రహ క్షేత్రాల గురించి తెలుసుకుందాం.
రవి (సూర్యభగవానుడు)కి సంబంధించిన క్షేత్రాలు
అరసవెల్లి
శ్రీకాకుళం జిల్లా అరసవిల్లిలో సూర్యనారాయణమూర్తి ఆలయం ఉంది. ఈ ఆలయాన్ని ఆదివారం రోజున కొన్ని వేల మంది దర్శించుకుంటారు. ఇక్కడ రథసప్తమి వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతాయి. ఈ క్షేత్రంలో సూర్య నమస్కారాలు చేయించుకుంటే ఆరోగ్యం, ఐశ్వర్యం లభిస్తాయి. రవి అనుగ్రహం కావాలంటే అరసవెల్లి క్షేత్రం దర్శించాలి. ఈ క్షేత్రం శ్రీకాకుళానికి కొద్ది దూరంలో ఉంది. రైలు, బస్సు ద్వారాగాని శ్రీకాకుళం చేరుకుని, అక్కడి నుండి అరసవెల్లి క్షేత్రం చేరుకోవచ్చు.
గొల్లల మామిడాడ
తూర్పుగోదావరి జిల్లాలోని జి.మామిడాడ గ్రామంలో ఉన్న సూర్య దేవాలయాన్ని కూడా అనేకమంది భక్తులు దర్శించుకుంటారు. ఈ క్షేత్రంలో కూడా వైష్ణవ సంప్రదాయంగా సూర్యారాధన జరుగుతుంది. ఈ క్షేత్రానికి రాజమండ్రి నుండి బస్సులో వెళ్ళవచ్చు.
తిరుచానూరు
తిరుపతి తిరుచానూరు పద్మావతి అమ్మవారి దేవస్థానంలో కొలను పక్కనే, చిన్న సూర్య దేవాలయం ఉంది. ఇందులో స్వామి నిల్చొని దర్శనమిస్తారు.
విజయవాడ
విజయవాడ పోరంకిలో సూర్య దేవాలయం ఉంది. చిన్నదే అయినా మహిమగల దేవాలయం. పెద్దాపురంలో కూడా రవికి సంబంధించిన దేవాలయం వుంది.
రవికి సంబంధించిన అధిష్ఠాన దేవత శ్రీ మహావిష్ణువు. శ్రీ మహావిష్ణువుకి సంబంధించిన క్షేత్రాలు చాలా ఉన్నాయి. రవి దోషాలు పోవాలంటే శ్రీమహావిష్ణువు క్షేత్రాలను దర్శించాలి.
భావనారాయణ క్షేత్రాలు
నారాయణ అనే పేరుతో మూడు క్షేత్రాలు ఉన్నాయి. అవే భావన్నారాయణ స్వామి క్షేత్రాలు. ఒక్క భావనతో స్వామి ప్రత్యక్షమయ్యే క్షేత్రాలుగా ప్రసిద్ధిపొందాయి. గుంటూరు జిల్లాలో ఉన్న పొన్నూరు, బాపట్ల ప్రాంతాల్లో కేవలం 30 కిలోమీటర్ల పరిధిలోనే సూర్యదేవాలయాలు రెండూ నెలకొని ఉన్నాయి. కనుక ఈ రెండు క్షేత్రాలు ఒకేసారి దర్శించుకోవచ్చు. సర్పవరం కాకినాడ జిల్లా కాకినాడ దగ్గరలో ఉంది. ఈ సర్పవరంలో భావన్నారాయణ స్వామి అద్భుతమైన క్షేత్రం. కృష్ణాజిల్లాలో శ్రీకాకుళం అనే ఊరు ఉంది (శ్రీకాకుళం జిల్లా కాదు..). ఇక్కడ శ్రీకాకుళంలో శ్రీకాకుళాంధ్ర మహావిష్ణు దేవాలయం ఉంది. సాలగ్రామ దండతోటి అలరారుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా రవి గ్రహానికి సంబంధించిన క్షేత్రాలు.