బృందావని విశ్వపూజిత విశ్వపావని
పుష్పసార నందనీచ తులసీ కృష్ణజననీ
విష్ణువుకు అలంకార స్వరూపిణిగా ఉండి విష్ణువుచే కామింపబడి విష్ణుపాదమందు నివాసమేర్పరచుకొన్న సాధ్వి తులసీమాత. దైవారాధనకు ఉపయోగించే సమస్త పత్ర పుష్పాలన్నింటిలో ఉత్తమోత్తమమైనది. తులసిని చూచుట వలన, స్పర్శ చేతను తపస్సంకల్ప పూజాదులను సిద్ధింపచేసి నిర్వాణ పదవిని ప్రసాదింపచేసే వరదాయిని. ఈ కలియుగంలో సమస్త తీర్థాలను పవిత్రం చేస్తూ పరమపావనియై సమస్త దోషాలను దహించే అగ్ని స్వరూపిణి. తులసి వదలిన శరీరమే గండకీనదియై మహాప్రవాహమై ప్రభావముతో శోభిల్లుచున్నది. తులసి శిరోజములే తులసి అను పేరుతో త్రిలోక పవిత్రములగు పత్రములై, పుష్పములై విరాజిల్లుచున్నవి. ఆ పత్రములతో పూజించిన సమస్త కార్యములు నెరవేరును.
గోలోకవాసిని యగు తులసీ వృక్ష మూలమును ముట్టినవారికి సమస్త దోషములు పోయి సర్వ తీర్థములలో స్నానము చేసిన ఫలితము. తులసి చరిత్రము విన్నవారికి సమస్త పాప విమోచనము కలుగును. సమస్త ప్రపంచము తులసిని తాకాలని, చూడాలని కోరుకుంటుంది. మానవులు చేసే సత్కర్మలన్నీ సఫలమవ్వాలంటే తులసి ఉండి తీరాల్సిందే. సర్వకామద, మోక్షద అయిన తులసి భారతభూమియందు అవతరించిన కల్పవృక్షము. ఈ కల్పవృక్షం ఉన్నవారి గృహాలు సర్వైశ్వర్యపూర్ణాలై వర్థిల్లుతాయి. అందుకే ప్రతినిత్యం ఆ మాతకు ప్రదక్షిణలు చేస్తూ ఈ కింది శ్లోకం పఠించాలి.
తులసీధాత్రి నమస్తుభ్యం-వైకుంఠ వైష్ణవుల యాత్రఘోరమైన పాపాల బంధనం-అలికి ముగ్గుపెట్టిన భాసునీ అందంవన్నెకెక్కిన పిండివంటలు, కూరలు, అన్నముతో నైవేద్యము చేసిన వార్కి అన్నవస్త్రాదులు అతిధులై ఉందురు. అక్షింతలు, పువ్వులు పూజచేసిన గోవర్ధనం.ముక్తి కోరిన వార్కి ముక్తి, సేవింతు శ్రీతులసి లేవమ్మ భావింప పరలోక పావనివికల్పవృక్షములేలమ్మా? వాకిట నీవుండవలెనమ్మాఉల్లాసము నీకుంచవలెనమ్మ అరుదైన కృష్ణుడు వాకిటగలడమ్మాకృష్ణుని కృపను కలుగవలెనని-కృష్ణతులసి నీకిస్తు అర్ఘ్యములురాముడు కృపను కలుగవలెనని-రామతులసి నీకిస్తు అర్ధ్యములుఎన్ని బిందువులో అన్నియును స్వర్గమార్గానికే సొంపారునట్లు ఒక్కప్రదక్షిణం వనిత నీకిస్తు –వైకుంఠవాసుణ్ణి చూపించవమ్మరెండవ ప్రదక్షిణం రమణి నీకిస్తు నిండార సంపదలు నాకీయవమ్మమూడవ ప్రదక్షిణం ముక్తి కందాము తల్లి తులసమ్మనాల్గవ ప్రదక్షిణం నాతి నీకిస్తు నవధాన్యాలు నాకీయవమ్మఐదవ ప్రదక్షిణం అతివ నీకిస్తు అష్ఠదళ పుత్రులు నాకీయవమ్మఆరవ ప్రదక్షిణం తల్లి నీకిస్తు ఆరున్నొక్క ఐదవతనం కోరిన పదవి.
పైవిధంగా తులసీమాతను సేవిస్తూ మన జీవితములు ధన్యతను పొందునట్లు వేడుకుందాము.
తులసి వృత్తాంతము
శ్రీహరి నారదునితో ఈవిధంగా చేప్పాడు. ధర్మధ్వజుడు మాధవీదేవిని వివాహమాడి న్యాయమూర్తియై సమస్త రాజులు కొలుచుచుండగా భార్యతో సుఖములందుచూ గంధమాదన పర్వతానికి పోయి జలక్రీడలాడుచుండేవాడు. రేయింబవళ్ళు వంద దివ్య సంవత్సరాలు శృంగార క్రీడల్లో మునిగిపోయారు. మాధవీదేవి గర్భవతియై నెలలు నిండినాక కార్తీకపూర్ణిమ శుక్రవారం నాటి శుభముమూర్తంలో సాక్షాత్తూ లక్ష్మీదేవి అంశతో ఆడబిడ్డను ప్రవసించింది. సాటిలేని సౌందర్యవంతురాలైన ఆ బాలికను చూసినవారంతా సాటిలేనిది అనుకుంటూ ‘తులసి’ అను పేరుతో పిలిచేవారు.
దివ్యమంగళ స్వరూపముతో జన్మించిన ఆమె సౌందర్యము మూడులోకాల్లో లేదన్నారు. శీతాకాలములో వేడిగల శరీరము గల కన్యనుచూసి దేవకన్యకలకే కళలేదన్నారు.
శ్రీహరిని గూర్చి తపస్సు చేయుటకు తులసి బదరికావనికి వెళ్ళి లక్ష దివ్య సంవత్సరాలు తపస్సాచరించింది. తపోనిష్ఠకు, నియమపాలనకు బ్రహ్మ సాక్షాత్కరించాడు. తులసి నమస్కరించగానే వరము కోరుకోమన్నాడు.
పూర్వం గోలోకంలో కృష్ణునితో రాసక్రీడలో ఉన్న నన్ను చూసి రాధ గోవిందుని బెదిరించి నన్ను భూలోకంలో మానవకాంతగా పుట్టమని శపించింది. నారాయణుడే నేనే నీ భర్త నౌతానని వరం ఇచ్చి భూలోకంలో తపస్సు చెయ్యమని ఆజ్ఞాపించాడు. అందువల్ల మానవకాంతగా పుట్టి తపస్సు చేసిన నాకు నారాయణుడే భర్త అగునట్లు వరం ఇవ్వమని తులసి బ్రహ్మదేవుని కోరింది.
రాధాశాపముతో సుదాముడు అనే గోపకుడు విష్ణుకళతో జన్మించాడు. అతడే శంఖచూడుడు. రాక్షసరాజు, చతుర్భుజుడు. గోలోకములోన సౌందర్యముగోరి మోహ పరవశుడగుచుండ రాధ యదలించెను. నీవుగూడా పూర్వజన్మ వృత్తాంతము తెలుసుకొని శంఖచూడుని వరింపుము. తరువాత గోపాల దేవుని వరింతువుగాక! అని బ్రహ్మదేవుడు చెప్పి నీవు శ్రీపతి శాపముచే పవిత్రమైన వృక్షము కాగలవు. నిన్ను కలుపకుండా పూజించినచో పూజ ఫలించదు. బృందావనములో నిన్ను శ్రీకృష్ణుడు ప్రేమగా చూస్తాడు. పెద్దలంతా నిన్ను చూసి నమస్కరిస్తారు. నీపత్రములతో గోవిందుని ఆరాధించిన అతడెంతయో సంతసించగలడు. నీవు పుణ్యాకృతి దాల్చి లక్ష్మీపతి వద్ద వృక్షముగాను, దేవి గాను ఉండగలవని నా వరము. నీకు లాభించునని వరదానము చేసెను.
తులసి బ్రహ్మకు మొక్కి నా మనస్సులోని సందేహం వివరిస్తాను. నీవనుమానించి సమాధానం ఇవ్వటం మానరాదు. నాకు రెండుచేతులున్నవానియందు ఉన్న ప్రేమ నాలుగు చేతులున్నవానిమీద లేదు. నేను శంఖచూడుని వరిస్తాను. గోపాలునితో ఇదివరలో సుఖించాను. రాధాభయముతో శ్రీకృష్ణుని వివాహమాడలేదు. నాకాయోగము కల్పించమని ప్రార్థించినది. నీవు శోడశాక్షరీ మంత్రము రాధాపరముగా జపింపుము. నీవు రాధతో సమానముగా నుండగలవు. అని రాధామంత్ర కవచస్తోత్రాదులు, పూజావిధిని ఉపదేశించాడు. ఆమె మంత్రప్రభావముతో లక్ష్మీదేవి వలె హరిప్రియగా వర్తించసాగినది. సమస్త భోగాలు తులసికి అందొచ్చాయి. ఆ కారణంగా తన తపఃక్లేశాన్ని కూడా మరిచిపోయింది.
‘‘సిద్ధే ఫలే నరాణాంచ దుఃఖంచ సుఖముత్తమమ్’’
తులసి తపోవనంలో రాజభోగాలను అనుభవిస్తూ విందులు, వినోదాలతో కాలం గడుపుతోంది. ఒకనాటి రాత్రి సుందరాంగుడు, రత్నభూషాలంకృతుడైన యువకుడు వెంటపడునట్లు భ్రాంతిపడుచు ఆ భ్రాంతిలోనే అనేక మధుర భావనలను అనుభవిస్తూ విరహవేదనలో ఉంది. ఇంతలో శ్రీకృష్ణ మంత్రోపాసకుడైన సిద్ధ యువకుడు బ్రహ్మ ఆజ్ఞగా ఆశీర్వచన బలంతో శంఖచూడుడు తులసిని సమీపిస్తున్నాడు. తులసి తెలియకుండానే లేచి నిలబడింది. శంఖచూడుడు తులసిని వివవరాలు అడిగాడు. తులసి స్త్రీ అయి ఉండి, స్త్రీ ప్రవర్తనను నిందిస్తూ శంఖచూడుని కోరికను సున్నితంగా తిరస్కరించింది. అప్పుడు శంఖచూడుడు దేవి అంశలను, తపస్వినులను, పతివ్రతలను గురించి చెప్పి స్త్రీలందరినీ నిందించవద్దు. స్త్రీలందరూ దేవీ స్వరూపాలని చెప్పాడు.
తులసి, శంఖచూడుల వివాహము
బ్రహ్మదేవుడు నీ గురించి, నాగురించి, రాధాదేవి ఇచ్చిన శాపాన్ని, కృష్ణుని వరాన్ని వివరంగా చెప్పి అతని ఆజ్ఞగా నీ వద్దకు నన్ను పంపాడని శంఖచూడుడు తులసితో అన్నాడు.
అదివిని తులసి విలాసముగా నవ్వుతూ అతడి ఉన్నతమైన వ్యక్తిత్వాన్ని ప్రశంసిస్తూ నిన్ను పరీక్షించాలని స్త్రీనింద చేసాను అని వివరించింది. అంతలో బ్రహ్మదేవుడు అక్కడికి వచ్చి గాంధర్వ పద్ధతిలో తులసిని వివాహమాడమని శంఖచూడుని ఆజ్ఞాపించాడు. పరీక్షలు చాలించి గుణవంతుడైన, మహావీరుడైన శంఖచూడుని వరించమని తులసిని ఆదేశించాడు. ఇద్దరూ లక్ష్మీనారాయణులై సుఖసౌభాగ్య సంపదలతో వర్థిల్లుతూ కాలంగడిపి ఆ పైన గోలోకం చేరుకుందురుగాని. అప్పుడు నువ్వు కృష్ణపరమాత్మను కలిసికొందువు అని ఇరువురినీ ఆశీర్వదించి తనలోకానికి వెళ్ళిపోయారు.
బ్రహ్మదేవుని ఆజ్ఞ ఆశీర్వచనాలతో తులసి శంఖచూడులు గాంధర్వవివాహం చేసుకున్నారు. తులసి పారిజాత పుష్పాన్ని రత్నపుటుంగరాన్ని ముల్లోకాలలోను దుర్లభమైన అమూల్యమైన మణిని శంఖచూడునికి బహుమానంగా ఇచ్చింది. శంఖచూడుడు వరుణదేవుని నుండి జయించి తెచ్చిన అమూల్యమైన వస్త్రాలను, ముల్లోకాలలోను దుర్లభమైన రత్నమాలికను, మంజీరాలను, కేయూర కుండలాలను, కంకణాలను, అంగుళీయకాలను, విశ్వకర్మ ఇచ్చిన అపూర్వమైన శంఖాన్ని, పద్మపత్ర నిర్మితమైన పడకను బహుమానంగా ఇచ్చాడు. పర్వత సీమలలో కూడా విహరించారు. తరువాత శంఖచూడుడు తులసీదేవితో రాజ్యపాలన చేశాడు. మన్వంతరకాలం పాలించాడు.
దేవతలంతా రాక్షసుల చేతుల్లో పరాజితులై బ్రహ్మ, శివులను వెంటబెట్టుకుని శ్రీహరి దగ్గరకు వెళ్ళారు. మన్వంతరకాలం పూర్తయిన శంఖచూడునికి అవతార పరిసమాప్తి కాలం సమీపించింది. శంఖచూడుడు మహాబలశాలి. యోగవిద్యా విశారదుడు. సర్వమాయాప్రభావ నిపుణుడు.
శ్రీహరినుద్దేశించి దేవతలు శంఖచూడుని బాధలు భరింపలేకున్నాము అని మొరపెట్టుకున్నారు. శ్రీహరి వానిని చంపజాలను. వాడు నాభక్తుడు. నా శూలము శివునికిచ్చి యాతనిచే వానిని వధింపజేతునని శూలమునిచ్చెను. శంఖచూడుని మెడలో సర్వమంగళకరమైన నా కవచం ఉంటుంది. దాన్ని ఎప్పుడు విడువడు. అది ఉన్నంతకాలం మన వలన పరాజయం ఉండదు.
నేను బ్రాహ్మణ రూపంలో వెళ్ళి ఆ కవచాన్ని అడిగి తీసుకుంటాను. వానిని వధింప సాధ్యముకాదు. వాని భార్య తులసికి పతివ్రతాభంగము జరిగినప్పుడు గాని వధింపజాలమని, నా తేజస్సును ఆమె గర్భములో ఉంచవలెనని చెప్పెను. వారామాటలు విని వాని మరణ యత్నములో ఉన్నారు.
స్వర్గరాజ్యము దేవతలకి ఇచ్చి సుఖముగా నుందువా? లేక యుద్ధమునకు దిగెదవా? తేల్చుకొమ్మని శంకరుడు దూతచే శంఖచూడుని అడిగించెను. ఆ మాట విని శంఖచూడుడు నేను రేపు శంకరుని దర్శింతుననెను. తులసి శివునితో యుద్ధము తగదని, ఆతని ఆశ్రయింప ఆయుర్వృద్ధి యగునని అనేక ప్రకారముల భర్తను బ్రతిమాలి చూచెను. తులసి భర్త యుపదేశించిన శ్రీకృష్ణ మంత్ర ప్రభావముచే సుఖనిద్ర స్మరించి జయార్ధమనేక దాన ధర్మము లాచరించెను. తన పుత్రునకు పట్టముగట్టి యుద్ధోన్మాదయై యుండెను.
విష్ణువు సాలగ్రామముగా మారటం
శంఖచూడుడు పరమశివునితో యుద్ధంలో ఉండగా, విష్ణువు తులసి వద్దకు ఆమె భర్త రూపంలో వస్తాడు. తులసి ఆయనను గుర్తుపట్టలేక తన భర్త అనే భావిస్తుంది. మహావిష్ణువు తాకగానే ఆమె తన భర్త కాదని గ్రహిస్తుంది. ఆమె పతివ్రతా నిష్ట భగ్నం అయి, శంఖచూడుడు బలహీనుడవుతాడు. తన తప్పు తెలుసుకుని, తులసి మహావిష్ణువు నిజరూపాన్ని కోరుతుంది. ఆమె తను పూజించిన దేవుడే తనని మాయ చేసాడని తెలిసి బాధపడుతుంది.
మహావిష్ణువు మారురూపం తెలుసుకుని, తన పవిత్రతపై జరిగిన మోసానికి తులసి మహావిష్ణువుని శపిస్తుంది. అతన్ని రాయికమ్మని శపిస్తుంది. విష్ణువు ఆమె శాపాన్ని అంగీకరించి గండక నది వద్ద సాలిగ్రామ శిలగా మారతాడు. దీని తర్వాత, శంఖచూడుడు పరమశివుని చేతిలో హతుడవుతాడు. తులసి కూడా కృంగిపోయి, తన జీవితాన్ని ముగించాలనుకుంటుంది. విష్ణుమూర్తి ఆమె తులసీవృక్షంగా మారి తనతో పాటు పూజించబడుతుందని వరం ఇస్తాడు. ఆయనను తులసి దళం లేకుండా చేసే పూజ ఎప్పటికీ ఫలితమివ్వదు. అందుకే హిందూ ఆచారాలలో తులసి విడదీయలేని భాగం అయిపోయింది. ఈ విధంగా తులసిదేవత వరంగా మారి ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటూ అందరికీ మంచి ఆరోగ్యం ఇచ్చి దీవెనలందిస్తుంది.