మాఘశుద్ధ పంచమినే శ్రీపంచమి అంటారు. జనవరి 30న ఈ పర్వదినాన్ని జరుపుకోనున్నాము. దీనినే వసంత పంచమి అని కూడా పిలుస్తారు. బ్రహ్మదేవుని ఇల్లాలిగా చేతిలో వీణను, మరో చేతిలో కమలాన్ని పట్టుకుని చిరునవ్వుతో తన అనుగ్రహాన్ని ప్రసాదించే తల్లిని శ్వేతపద్మాసనగా, శ్వేతాంబరిగా సేవిస్తారు. సకల విద్యలకు అధిదేవతగా పిలుస్తున్నఈ తల్లి జన్మదినం మాఘశుద్ధ పంచమిగా పరిగణింపబడుతోంది.
జ్ఞానదానమే మకుటాయమానం
ఈ మాఘమాసంలో పంచమి తిథిని విద్యారంభాన్ని చేసిన వారికి సర్వ విద్యలూ అతిసులభంగా కరతలామలకం అవుతాయని తల్లిదండ్రులు తమ పిల్లలకు అక్షరాభ్యాసాన్ని చేయిస్తుంటారు. పార్వతీకళ్యాణం కోసం తన శరీరాన్ని కూడా లెక్కచేయని మన్మధుడు జనులకు వసంతాన్ని తెస్తాడని విశ్వసిస్తారు. ప్రకృతికూడా వసంతాగమనాన్ని తన మొక్కల లేత చిగుళ్ళ ద్వారా తెలుపుతుంది. అప్పుడపుడే మొగ్గతొడిగే వసంతాగమనాన్ని ఆహ్వానిస్తూ వంగదేశంలో రతీమన్మథుల సేవ చేస్తారు. విద్యవల్లనే అధికారము, ధనము సంప్రాప్తమవుతాయని వాటిని మరలా సక్రమ మార్గంలోవినియోగించాలన్నా దానికి కూడా విచక్షణాజ్ఞానం ఆ శారదాంబనే ఇవ్వాలని అందుకే సరస్వతీదేవిని జ్ఞానభిక్ష ప్రసాదించమని వేడుకోవాలని పురాణవచనం. ఎవరూ దొంగిలించలేని ధనం జ్ఞానం. కనుక దాన్ని దానం చేస్తున్న కొద్దీ అది పురోభివృద్ధే అవుతుంది. కనుక జ్ఞానదానమే అన్ని దానాల్లోకి మకుటాయమానమైంది.
వసంతపంచమి రోజున సరస్వతీ పూజా విధానం
మాటతోనే వ్యక్తుల మధ్య స్నేహవారధులు ఏర్పడుతాయని, మాటతోనే సద్బుద్ధి, సమబుద్ధి ప్రకటితమవుతుందని అంటారు. ఆ సరస్వతీదేవి సర్వప్రాణుల యెడల సమబుద్ధి కలిగి ఉండాలని కోరుకోవాలంటారు. అశ్వలాయనుడు సరస్వతీ కటాక్షాన్ని పొందిన విధివిధానాలను సరస్వతీ రహస్యోపనిషత్ చెబుతుంది. ‘సామాంపాతు సరస్వతి’ అని సరస్వతికి నమస్కారం చేస్తే చాలట. ఆ తల్లి సర్వాన్ని అనుగ్రహిస్తుందని అంటారు. శ్రీపంచమి రోజున తెల్లని జాజిమల్లెలవంటి పూలతో పూజించి అమ్మవారిని శ్వేతవస్త్రాలతో అలంకరించి, సరస్వతీ అష్టోత్తర శతనామావళిని పఠించి అమ్మవారికి తెల్లని రంగులో ఉన్న క్షీరాన్నాన్ని, నేతి పిండివంటలను, చెరకును, అరటిపండ్లను, నారికేళాన్ని నివేదన చేస్తే అమ్మవారి అనుగ్రహం లభిస్తుందని పెద్దల వాక్కు. వ్యాస, వాల్మీకులు సైతం అమ్మ అనుగ్రహవీక్షణాలతోనే వేదవిభజన చేయడం, పురాణాలు, గ్రంథాలు, కావ్యాలు రచించడం జరిగిందంటారు. జ్ఞానప్రదాయినిగా, ధనప్రదాయినిగా శారదాదేవిని ఉపాసించుమని వేదం కూడా ఉద్బోధిస్తుంది.
సరస్వతి నన్ను పాలించుగాక...అంటూ తల్లిని కాపాడుమని రక్షించుమని దశశ్లోకీని ఆరు నెలలు పఠిస్తే వాక్కు ప్రసన్నమై, సర్వత్రా విజయం చేకూరుతుంది. ఈ శ్లోకాలను మాఘశుద్ధ పంచమినాడు పఠించి ఏ విద్యను ప్రారంభించినా, ఆ విద్య దినదినాభివృద్ధి చెందుతుంది. నిత్యం ఈ శ్లోకములను ధ్యానం చేసేవారికి వాక్శుద్ధి కలుగుతుంది. సర్వసంపదలూ ఒనగూరుతాయి. ఈ మాఘశుద్ధ పంచమినాడు సరస్వతిని స్తుతిద్దాం. అమ్మ దయను పొందుదాం. l