మోక్షదా ఏకాదశి:2022: మోక్షదా ఏకాదశి ఎప్పుడు? ఏవిధంగా జరుపుకోవాలి?

హిందూ పంచాంగం ప్రకారం, ప్రతి సంవత్సరం మార్గశిర మాసంలో శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశిని మోక్షద ఏకాదశిగా జరుపుకుంటారు. ఈ పవిత్రమైన రోజున శ్రీ మహా విష్ణువును పూజిస్తారు. ఈ ఏకాదశి రోజున ఉపవాసం ఉండటం వల్ల సకల పాపాల నుంచి విముక్తి పొందడమే కాకుండా మోక్షం లభిస్తుందని పురాణాల్లో వివరించబడింది. అందుకే దీన్ని మోక్షద ఏకాదశి అంటారు. 

మోక్షద ఏకాదశి రోజున కొన్ని ప్రత్యేక పూజలు చేసిన వారికి ఆనందం, శ్రేయస్సు, సంపద లభిస్తుందని చాలా మంది నమ్ముతారు. ఈ పవిత్రమైన రోజున ఉపవాస వ్రతాన్ని ఆచరించడం వల్ల పూర్వీకులు కూడా పాపాల నుంచి విముక్తి పొందుతారని పండితులు చెబుతారు. సాధారణంగా శుక్ల పక్షంలో, కృష్ణ పక్షంలో ఏకాదశి తిథులొస్తాయి. ఈ పర్వదినాన శ్రీ హరిని ఆరాధించినప్పటికీ, మార్గశిర మాసంలో వచ్చే మోక్షద ఏకాదశిని మాత్రం అన్నింటికంటే ప్రత్యేకమైనదిగా పరిగణిస్తారు. ఈ పవిత్రమైన రోజున వ్రతం ఆచరించిన వారికి నరకం నుంచి కచ్చితంగా విముక్తి లభిస్తుందని.. ద్వాపర యుగంలో శ్రీక్రిష్ణుడు అర్జునుడికి బోధించాడు. అందుకే ఇదే రోజున గీతా జయంతి కూడా జరుపుకుంటారు.