తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల మొదటిరోజైన ఆదివారం రాత్రి శ్రీ పద్మావతి అమ్మవారు శ్రీ గోపాల కృష్ణుడి అలంకారంలో పిల్లనగ్రోవి ధరించి చిన్నశేషవాహనంపై అభయమిచ్చారు. రాత్రి 7 గంటల నుంచి అమ్మవారు నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలు , మంగళవాయిద్యాల నడుమ వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి అమ్మవారిని దర్శించుకున్నారు.
మొదటి వాహనం చిన్నశేషుడు. చిన్నశేష వాహనంపై అమ్మవారు జీవకోటిని ఉద్ధరించే లోకమాతగా దర్శనమిచ్చారు . శేషభూతమైన ఈ ప్రపంచం సిరులతల్లి రక్షణలో సుఖాన్ని పొందుతోంది. ఈ వాహనంపై అమ్మవారి దర్శనం వల్ల యోగసిద్ధి చేకూరుతుందని భక్తుల విశ్వాసం.