ప్రథమం శైలపుత్రీ చ ద్వితీయం బ్రహ్మచారిణీ |
తృతీయం చంద్రఘంటేతి కూష్మాండేతి చతుర్థకమ్ ||
పంచమం స్కందమాతేతి షష్ఠం కాత్యాయనీతి చ |
సప్తమం కాలరాత్రీతి మహాగౌరీతి చాష్టమమ్ ||
నవమం సిద్ధిదాత్రీ చ నవదుర్గాః ప్రకీర్తితాః |
ఉక్తాన్యేతాని నామాని బ్రహ్మణైవ మహాత్మనా ||
ఇలా దుర్గాదేవి తొమ్మిది రూపాలతో విరాజిల్లుతుంది
దేవీ నవరాత్రులు అక్టోబరు 3, 2024 నుంచి ప్రారంభమవుతాయి. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా ఆలయాలను అలంకరించడం, ఇళ్లలో అమ్మవారి పారాయణం చేయడం, అలంకరించడం, అమ్మవారి భక్తిలో మునిగితేలడం జరుగుతుంది. దుర్గా దేవి వివిధ రూపాలు దేవీ నవరాత్రులలో పూజిస్తారు. అందువల్ల, నవరాత్రులలో ప్రతి రోజు, మాతా దుర్గకు వివిధ రకాల నైవేద్యాలను సమర్పిస్తారు. అయితే దుర్గమ్మ అనుగ్రహం మీపై ఉండాలన్నా, మీరు చేసిన పూజనుంచి సత్ఫలితాలు పొందాలన్నా కొన్ని నియమాలు తప్పనిసరిగా పాటించాలి...
పరిశుభ్రత ముఖ్యం
సాధారణంగా పూజ, వ్రతం, నోము, పండుగ అనేకాదు ఎప్పుడూ కూడా పరిశుభ్రత పాటించడం అందరికీ చాలా అవసరం. అయితే శరన్నవరాత్రుల్లో ఇది మరికొంచెం ఎక్కువగా ఉండాలి. ఎలా అంటే తెల్లవారుజామునే స్నానం ఆచరించిన తర్వాతే దేవుడి మందిరంలోకి అడుగుపెట్టాలి. స్నానం అనంతరం దేవుడి పాత్రలు శుభ్రం చేసుకుని శుచిగా నైవేద్యం వండిపెట్టి పూజచేయాలి. పూజ సమయంలో ధరించే దుస్తులు ప్రత్యేకంగా పెట్టుకోవాలి.
పూజ చేసేటప్పుడు అమ్మమీదే దృష్టినిలపాలి
దుర్గా పూజ చేస్తున్న సమయంలోను, శ్లోకాలు చదువుతున్న సమయంలో ఎవ్వరితోనూ మాట్లాడకూడదు, వేరే పని నిమిత్తం లేవకూడదు. దీనివల్ల పూజనుంచి వచ్చే అనుకూల ఫలితాలు కన్నా మీ చుట్టూ ప్రతికూల శక్తి పెరుగుతుందంటారు.
తోలు వస్తువులు పనికిరావు
పూజ సమయంలో తోలుతో చేసిన వస్తువులు ధరించి పూజా మందిరంలో అడుగుపెట్టకూడదు. ఆలయానికి వెళ్ళేటప్పుడు బెల్టులు కూడా ధరించకూడదు. లెదర్ వస్తువులు ధరించి పూజకు కూర్చుంటే అనుకూల ఫలితాలు కన్నా ప్రతికూల ఫలితాలే ఎక్కువ ఉంటాయి.
పగటినిద్ర కూడదు
విష్ణు పురాణం ప్రకారం శరన్నవరాత్రులు చేస్తున్నవారు పగటిపూట నిద్రించడం నిషిద్ధం. ఉపవాసం ఉండేవారైతే ఈ తొమ్మిది రోజులు పగటివేళ అమ్మవారి కీర్తలతో సమయం గడపాలి.
మాంసాహారం,ఉల్లిపాయ, వెల్లుల్లి తినొద్దు
నవరాత్రులలో ఉల్లిపాయ, వెల్లుల్లి , మాంసాహారం ఇంట్లో వండకూడదు. బయటి నుంచి తెచ్చుకుని కూడా తినకూడదు. నియమ నిష్టలతో తొమ్మిదిరోజుల పాటూ అమ్మవారికి పూజలు చేస్తున్న ఇంట్లో సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవడం తప్పనిసరి నియమం.
గోళ్ళు తీయడం, క్షవరం పనికిరాదు
శాస్త్రాల ప్రకారం నవరాత్రి తొమ్మిది రోజులు గడ్డం, మీసాలు, జుట్టు, గోర్లు కత్తిరించకూడదు.