బ్రహ్మాండనాయకుని బ్రహ్మోత్సవానికి సర్వం సిద్ధమయింది. నవాహ్నిక దీక్షతో, నవబ్రహ్మలు తొమ్మిది రోజులు జరిపించే ఉత్సవాలు కాబట్టి ఇవి 'బ్రహ్మోత్సవాలు'. వీటినే సాలకట్ల బ్రహ్మోత్సవాలని కూడా అంటారు. సెప్టెంబర్ 26వ తేదీ నుంచి అక్టోబర్ 6వ తేదీ వరకూ ఈ బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది టీటీడీ.అన్ని ప్రాంతాల భక్తులు ఈ ఉత్సవాలను దర్శించి తరించేందుకు తండోపతండాలుగా తరలివస్తారు. వాహనాలపై ఊరేగుతున్న స్వామివారిని కనులారా దర్శించుకుని భక్తిపారవశ్యంలో మునుగుతారు. కరోనా పుణ్యమా అని.. రెండేళ్లపాటు శ్రీవారి బ్రహ్మోత్సవాలు భక్తులు లేకుండా జరిగాయి. ఈ ఏడాది కరోనా తీవ్రత తగ్గడంతో బ్రహ్మోత్సవాలను భక్తుల సమక్షంలో నిర్వహించేందుకు టీటీడీ నిర్ణయించింది. ఈనెల 27వ తేదీ నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఆరంభం కానున్నాయి. రోజుకొక వాహనంపై స్వామివారు తిరుమాఢవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమివ్వనున్నారు.
బ్రహ్మోత్సవాలు ఇలా...
సెప్టెంబర్ 26వ తేదీన అంకురార్పణ, 27వ తేదీ సాయంత్రం 5:45 నుంచి సాయంత్రం 6:15 గంటల మధ్యలో మీన లగ్నంలో ధ్వజారోహణ కార్యక్రమం జరుగుతుంది.
- సెప్టెంబర్ 26 బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
- సెప్టెంబర్ 27 ధ్వజారోహణం, పెద్ద శేష వాహన సేవ
- సెప్టెంబర్ 28 చిన్న శేష వాహనం, స్నపన తిరుమంజనం, హంస వాహన సేవ
- సెప్టెంబర్ 29 సింహ వాహన సేవ, ముత్యపు పందిరి వాహన సేవ
- సెప్టెంబర్ 30 కల్పవృక్ష వాహన సేవ, సర్వ భూపాల వాహన సేవ
- అక్టోబర్ 01 మోహిని అవతారంలో స్వామి వారి దర్శనం, గరుడ వాహన సేవ
- అక్టోబర్ 02 హనుమంత వాహన సేవ, గజ వాహన సేవ
- అక్టోబర్ 03 సూర్యప్రభ వాహన సేవ, చంద్రప్రభ వాహన సేవ
- అక్టోబర్ 04 రథోత్సవం, అశ్వ వాహన సేవ అక్టోబర్ 05 చక్రస్నానం, ధ్వజావరోహణం