తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో సెప్టెంబరు 8 నుంచి 10వ తేదీ వరకు జరగనున్న పవిత్రోత్సవాలను పురస్కరించుకొని మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఘనంగా జరిగింది. ఆలయంలో జరిగే వివిధ రకాల సేవల్లో అర్చకుల వల్ల గానీ, భక్తుల వల్ల గానీ ఏదైనా లోపాలు జరిగి ఉంటే వాటిని పరిహరించేందుకు ఆ అమ్మవారికి ప్రతి ఏడాదీ పవిత్రోత్సవాలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.
ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి ఉదయం 7 నుండి 9.30 గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం చేపట్టారు. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేశారు. అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర జలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. అనంతరం భక్తులకు సర్వదర్శనం కల్పించారు.