కుసుమహర జయంతి 2022: ఆధ్యాత్మిక మార్గనిర్దేశకులు కుసుమహరనాథులు

 

క్షణికమైన ప్రాపంచిక సుఖాల కోసం పాకులాడటం మంచిది కాదు’ అంటూ మానవాళికి ఆధ్యాత్మిక మార్గనిర్దేశం చేసిన మహనీయులు కుసుమహరనాథులు. బెంగాల్‌లోని సోనాముఖి ప్రాంతంలో 1865 జులై 1న ఆయన జన్మించారు. తల్లిదండ్రులు జయరామ్‌ బంధోపాధ్యాయ, భగవతి సుందరి ఆయనకు పెట్టిన పేరు శ్రీహరనాథ్‌. అదే ప్రాంతంలో 1870, డిసెంబరులో కందర్పసుందర్‌ భట్టాచార్య, చంద్రవల్లీ దంపతులకు కుసుమ కుమారీదేవి జన్మించారు. పద్నాలుగేళ్ల వయసులో కుసుమకుమారీదేవితో హరనాథుడికి లౌకిక బంధం ఏర్పడి, అది అలౌకిక అనుబంధంగా మారింది. 

హరనాథులు చదువుకునే రోజుల్లోనే కృష్ణ లీలలను గానం చేసేవారు. అందరిలో ఉంది భగవంతుడైనప్పుడు, అంటరానివాడు ఎక్కడి నుంచి వచ్చాడు అంటూ సామాజిక అసమానతల మీద గట్టిగా గళం వినిపించారాయన. చైతన్య ప్రభువులు ప్రారంభించిన భక్తి ఉద్యమాన్ని, శ్రీకృష్ణ ప్రేమతత్వాన్ని ఆయన కొనసాగించారు. హరనాథుల బోధలు చాలా సరళంగా ఉంటాయి. ‘సంసారంలో ఉంటూనే భగవన్నామ స్మరణ చేస్తూ మన జీవితాలను ధన్యం చేసుకోవచ్చు. సంసారంలో మనం ఉండొచ్చు, సంసారం మనలో ఉండకూడదు. కృష్ణ స్తుతి లేని జీవితం ఎండిపోయిన కొలను’ అని చెప్పేవారు. 

రామకృష్ణ పరమహంసను శారదాదేవి సేవించినట్లే, కుసుమకుమారీదేవి కూడా హరనాథులకు ఆధ్యాత్మిక సాధనలో తోడుగా నిలిచారు. 1927 మే 25న హరనాథులు దేహత్యాగం చేసిన తర్వాత ఆయన బోధనలను ఆమె దేశమంతా ప్రచారం చేశారు. ఆమె లేని నేను లేను, నన్ను కుసుమహరనాథ్‌ అనే పిలవండి అని అర్ధాంగికి గొప్ప స్థానం ఇచ్చారు హరనాథులు. అనంతర కాలంలో వీరి శిష్యులు కుసుమహరనాథుల సందేశాన్ని ప్రచారం చేస్తూ దేశవ్యాప్తంగా ఎన్నో మందిరాలు నిర్మించారు. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్‌, దువ్వాడ, గుంటూరు, విజయవాడ, భద్రాచలం తదితర ప్రాంతాల్లో ఆధ్యాత్మిక కేంద్రాలున్నాయి.