పల్లకిపై మోహిని అలంకారంలో కోదండరాముడు

ఒంటిమిట్ట‌ శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజు గురువారం ఉదయం మోహిని అలంకారంలో శ్రీరామచంద్రుడు పల్లకిలో ఊరేగుతూ భక్తులకు కనువిందు చేశారు. ఉదయం 8 నుండి 10 గంటల వరకు వాహనసేవ వైభవంగా జరిగింది. భజన బృందాలు కోలాటాలు ఆడుతుండగా స్వామివారు నాలుగు మాడవీధుల్లో విహరించారు. భక్తులు అడుగడుగునా కర్పూర నీరాజనాలు అందించారు.

మోహిని అవతార వృత్తాంతం భాగవతంలో రమణీయంగా వర్ణింపబడింది. సురాసురులు అమృతానికై క్షీరసాగరాన్ని మథిస్తారు. చివరికి వారు కోరుకున్న అమృతం లభిస్తుంది. దానిని పంచుకోవడంలో కలహం తప్పదు. ఆ కలహాన్ని నివారించి, అసురులను వంచించి, సురులకు అమృతాన్ని పంచడానికి శ్రీహరి మోహిని రూపంతో సాక్షాత్కరిస్తారు. తనకు భక్తులు కానివారు ఆ మాయాధీసులు కాక తప్పదనీ, తనకు ప్రసన్నులైనవారు మాయను సులభంగా దాటగలరని స్వామి వారు మోహిని రూపంలో ప్రకటిస్తున్నారు.

వాహన సేవ అనంతరం ఉదయం 11 నుండిమ‌ధ్యాహ్నం 12 గంటల వరకు స్నపన తిరుమంజనం వేడుకగా జరిగింది. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరి నీళ్లతో సీతాలక్ష్మణ సమేత శ్రీకోదండరాములవారి ఉత్సవమూర్తులకు అభిషేకం చేశారు.