గరుడ వాహనంపై సీతాపతి

ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మూత్సవాల్లో భాగంగా ఐదో రోజు గురువారం రాత్రి స్వామివారు గరుడ వాహనంపై భక్తులను అనుగ్రహించారు. రాత్రి 7 గంటలకు ప్రారంభమైన వాహన సేవ 8.30 గంటల వరకు జరగనుంది.  భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.

నవాహ్నిక బ్రహ్మూత్సవాల్లో గరుడసేవ ముఖ్యమైనది. గరుత్మంతుడే శ్రీమహావిష్ణువుకు నిత్యవాహనం. దాసుడుగా, సఖుడుగా, విసనకఱ్ఱగా, చాందినిగా, ఆసనంగా, ఆవాసంగా, వాహనంగా ధ్వజంగా అనేక విధాల సేవలందిస్తున్న నిత్యసూరులలో అగ్రగణ్యుడైన వైనతేయుడు కోదండరామస్వామిని వహించి కదిలే తీరు సందర్శనీయమైనది. 108 దివ్య దేశాలలోనూ గరుడ సేవ విశిష్టమైనది.