విశాఖపట్నంలో టిటిడి నిర్మించిన శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయ మహాసంప్రోక్షణకు శుక్రవారం రాత్రి 7 గంటలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించారు.
ఇందులో భాగంగా రాత్రి 7 నుండి పుణ్యాహవచనం, విష్వక్సేనపూజ, ఆచార్య ఋత్విక్ వరణం, మృత్సంగ్రహణం, రక్షాబంధనం, మేధిని పూజ, వాస్తుహోమం, అంకురార్పణ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. రాత్రి 10 గంటల వరకు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తారు.
మార్చి 19న శనివారం ఉదయం 9 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు యగాశాలవాస్తు, పంచగవ్య్రపాశనం, రక్షాబంధనం, అకల్మషహోమం, అక్షిమోచనం, బింబశుద్ధి, పంచగవ్యాధివాసం చేపడతారు. సాయంత్రం 6 నుండి రాత్రి 9 గంటల వరకు అగ్నిప్రతిష్ట, కలశస్థాపన, కుంభావాహనం, కుంభారాధన, హోమం నిర్వహిస్తారు.
ఆకట్టుకుంటున్న విద్యుత్, పుష్పాలంకరణలు
టిటిడి విద్యుత్ విభాగం ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాలంకరణలు, పలు దేవతా మూర్తుల విద్యుత్ దీపాల కటౌట్లతో శ్రీవారి ఆలయం శోభాయమానంగా విరాజిల్లుతోంది. ఆలయంలోని ధ్వజమండపం, గర్భాలయం, శ్రీ పద్మావతి, శ్రీ ఆండాళ్ అమ్మవారి ఆలయం, శ్రీ ఆంజనేయస్వామివారి ఆలయాలను వివిధ రకాల సుగంధ, ఉత్తమజాతి పుష్పాలు, కట్ ఫ్లవర్స్‌తో అలంకరించారు.
శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం ముందు 18 హోమగుండాలు ఏర్పాటు చేశారు. శ్రీ ఆండాళ్ అమ్మవారి ఆలయం ముందు మార్చి 23వ తేదీ శ్రీవారి కల్యాణం నిర్వహించేందుకు షెడ్డు ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమంలో వైఖానస ఆగమ సలహాదారు శ్రీ విష్ణుబట్టాచార్యులు, తిరుమల శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకుల్లో ఒకరైన శ్రీ వేణుగోపాల దీక్షితులు, అర్చకులు పాల్గొన్నారు.