సృష్ఠిలోని సకల జీవరాశులు ఆయురారోగ్యాలతో ఉండాలని శ్రీవారిని ప్రార్థిస్తూ తిరుమల నాదనీరాజనం వేదికపై బుధవారం ఉదయం సుందరకాండలోని 36వ సర్గ నుంచి 38వ సర్గ వరకు ఉన్న 188 శ్లోకాలను పారాయణం చేశారు. ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారం ద్వారా భక్తులు తమ ఇళ్ల నుంచే పారాయణంలో పాల్గొన్నారు. ఈ 9వ విడత సుందరకాండ అఖండ పారాయణం ఉదయం 7 నుండి 9 గంటల వరకు జరిగింది.
కోవిడ్ – 19 లాక్‌డౌన్‌ను అధిగమించాలని లోక కల్యాణార్థం టిటిడి నిర్వహిస్తున్న పరాయణ యజ్ఞంలో భాగంగా, మంత్ర పరాయణం ప్రారంభించి జనవరి 27వ తేదీకి 293 రోజులు పూర్తి చేయగా, సుందరకాండ పారాయణం 231 రోజులు పూర్తి అయింది. వాల్మీకి మహర్షి రచించిన రామయణంలోని సుందరకాండ పారాయణం వలన బుద్ధి, బలం, దైర్యం, భయం లేక పోవడం, సఖల జీవులు ఆయురారోగ్యాలతో ఉంటాయి. సుందరకాండలోని 68 సర్గలలోని 2821 శ్లోకాలను మొత్తం 16 పర్యాయలు అఖండ పారాయణం నిర్వహిస్తారు. టిటిడి ఇప్పటివరకు ఎనిమిది పర్యాయలు సుందరకాండ అఖండ పారాయణం పూర్తి చేసింది.
తొమ్మిదవ విడత అఖండ పారాయణంలోని 188 శ్లోకాలను ధర్మగిరి వేద విజ్ఞాన పీఠం ప్రిన్సిపాల్ శ్రీ కెఎస్ఎస్ అవధాని పర్యవేక్షణలో శ్రీ పవన్‌కుమార్ శర్మ, శ్రీ రామానుజాచార్యులు పారాయణం చేశారు. ఈ పారాయణంలో దాదాపు 200 మంది ధర్మగిరి వేద పాఠశాల, ఎస్వీ వేద విశ్వవిద్యాలయం అధ్యాపకులు, ఎస్వీ ఉన్నత వేద అధ్యాయన సంస్థకు చెందిన వేద పారాయణ దారులు, రాష్ట్రీయ సంస్కృత విశ్వవిద్యాలయంకు చెందిన శాస్త్రీయ పండితులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో జాతీయ సంస్కృత వర్సిటీ ఉప కులపతి శ్రీ మురళీధర శర్మ, అన్నమాచార్య ప్రాజెక్ట్ సంచాలకులు శ్రీ దక్షిణామూర్తి, ఉన్నత వేద అధ్యయన ప్రాజెక్టు ప్రత్యేకాధికారి శ్రీ విభీషణ శర్మ తదితరులు పాల్గొన్నారు.