తిరుపతిలోని వేద వర్సిటీలో గల ధ్యానారామంలో 12 అడుగుల శివలింగానికి నెల రోజుల పాటు జరిగిన రుద్రాభిషేకం సోమవారం ఘనంగా ముగిసింది. నవంబరు 16 నుండి డిసెంబరు 14వ తేదీ వరకు ప్రతిరోజూ ఉదయం 6 నుండి 6.45 గంటల వరకు ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారం చేసిన ఈ రుద్రాభిషేకాన్ని ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు వీక్షించారు.
నెల రోజుల పాటు తిరుమల వసంత మండపంలో అశ్వత్థపూజ, సాలగ్రామ పూజ, రాధా దామోదర వ్రతం, తులసీ ధాత్రీ దామోదర వ్రతం, గోపూజ, విష్ణుపూజలు, వ్రతాలు, తిరుపతి కపిలతీర్థం ఆలయ ప్రాంగణంలో శివపూజలు, త్రిలోచన గౌరీ వ్రతం, స్కంధ షష్టి, సంకష్టహర గణపతి వ్రతం, శివసోమవార వ్రతాలు విశిష్టంగా నిర్వహించడం జరిగింది.
అనంతరం శివలింగానికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పసుపు, చందనం, విభూది తదితర సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. వేద పండితులు నమకం, చమకం పఠిస్తుండగా నైవేద్యం, హారతి సమర్పించారు.
శ్రీ కపిలేశ్వరాలయ ప్రాంగణంలో
కార్తీక మాస దీక్షల్లో భాగంగా సోమవారం తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరాలయ ప్రాంగణంలో కార్తీక సోమవార శివార్చనం శాస్త్రోక్తంగా జరిగింది.
ముందుగా పార్వతి పరమేశ్వరుల చిత్రపటానికి ప్రత్యేక పూజలు చేశారు. సంకల్పంతో ఈ పూజను ప్రారంభించి నైవేద్యం, హారతి సమర్పించారు. అనంతరం క్షమా ప్రార్థన, మంగళంతో ఈ పూజ ముగిసింది.
శ్రీ చండికేశ్వరస్వామివారి హోమం
తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా నెల రోజుల పాటు నిర్వహించిన హోమ మహోత్సవాలు సోమవారం ఘనంగా ముగిశాయి. చివరి రోజు శ్రీ చండికేశ్వరస్వామివారి హోమం, త్రిశూలస్నానం నిర్వహించారు.
ఇందులో భాగంగా ఉదయం శ్రీ చండికేశ్వరస్వామివారి హోమం జరిగింది. అనంతరం మహాపూర్ణాహుతి, కలశ ఉద్వాసన, మహాశాంతి అభిషేకం, కలశాభిషేకం, త్రిశూలస్నానం, అంకురార్పణ విసర్జన నిర్వహించారు.