లోకకల్యాణం కోసం కరోనా వ్యాధి కట్టడి కావాలనే సంకల్పంతో చేపట్టిన షోడశదిన సుందరకాండ పారాయణ దీక్ష బుధవారం పూర్ణాహుతితో దిగ్విజయంగా ముగిసింది. తిరుమలలోని ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో గత 16 రోజులుగా షోడశదిన సుందరకాండ పారాయణ దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే.
16 రోజుల పాటు ఎంతో దీక్షతో పారాయణం, హోమాలు, జపాలు వేద విజ్ఞాన పీఠం ప్రిన్సిపాల్, అధ్యాపక బృందం నిర్వహించారు. కరోనా నుంచి మానవాళికి విముక్తి కల్పించేందుకు చేపట్టిన ఈ మహత్తర కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఇతర రాష్ట్రాల నుండి 32 మంది ఉపాసకులు పాల్గొన్నారు. టిటిడిలో మొట్టమొదటిసారిగా నిర్వహించిన ఈ దీక్షలో ఉపాసకులు ఎంతో నియమనిష్టలతో శ్లోక పారాయణం, హోమాలు నిర్వహించారు. ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారం ద్వారా కోట్లాది మంది భక్తులు వారి ఇళ్లలో ఈ దీక్ష చేపట్టి పారాయణం చేశారు.
ముందుగా వేద విజ్ఞాన పీఠంలోని ప్రార్థనా మందిరంలో ప్రిన్సిపాల్ శ్రీ కెఎస్ఎస్.అవధాని ఆధ్వర్యంలో పూర్ణాహుతిలో భాగంగా వశోద్ధార హోమం, పూర్ణపాత్ర విసర్జన, బ్రహ్మ స్థాపన చేపట్టి నారాయణ సూక్తం పఠించారు. అంతకుముందు శ్రీవారి ఆలయం వెనుకవైపు గల వసంత మండపంలో సుందరకాండ శ్లోక పారాయణం ముగిసింది. ముగింపు రోజున శ్రీరామపట్టాభిషేకం శ్లోకాలను కూడా పఠించారు. వసంత మండపంలో “రాఘవో విజయం దద్యాన్మమ సీతా పతిఃప్రభుః ” అనే మహామంత్రం ప్రకారం సుందరకాండలోని మొత్తం 68 సర్గలలో 2,821 శ్లోకాలను 16 మంది సుందరకాండ ఉపాసకులు 16 రోజుల పాటు అత్యంత దీక్షాశ్రద్ధలతో పారాయణం చేశారు. అదేవిధంగా, ధర్మగిరి వేద పాఠశాలలో మరో 16 మంది ఉపాసకులు 16 రోజుల పాటు జప, హోమ కార్యక్రమాలు నిర్వహించారు.