సూర్య‌ప్ర‌భ వాహ‌నంపై కేశ‌వ‌మూర్తి అలంకారంలో శ్రీ మ‌ల‌య‌ప్ప‌


శ్రీవారి సాల‌క‌ట్ల‌ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడో రోజు శుక్ర‌‌‌వారం ఉదయం 9 నుండి 10 గంట‌ల వ‌ర‌కు శ్రీ‌వారి ఆల‌యంలోని క‌ల్యాణోత్స‌వ మండ‌పంలో శ్రీ మలయప్పస్వామివారు శంఖు, చక్రం, గ‌థ‌‌, అభ‌య‌హ‌స్తం ధ‌రించి చ‌తుర్భు‌జ కేశ‌వ‌మూర్తి అలంకారంలో దర్శనమిచ్చారు.





సూర్యప్రభ వాహనం – ఆయురారోగ్య‌ప్రాప్తి





బ్రహ్మోత్సవాలలో ఏడవ రోజు ఉదయం సూర్యనారాయణుడు సూర్యప్రభామధ్యస్తుడై దివ్యకిరణ కాంతుల్లో ప్రకాశిస్తూ సూర్యప్రభ వాహనంలో దర్శనమిచ్చారు. సూర్యుడు సకలరోగ నివారకుడు, ఆరోగ్యకారకుడు, ప్రకృతికి చైతన్యప్రదాత. ఔషధీపతి అయిన చంద్రుడు కూడా సూర్యతేజం వల్లనే ప్రకాశిస్తూ వృద్ధి పొందుతున్నారు. ఈ ఉత్సవంలో శ్రీవారి చుట్టూ ఉన్న సూర్యప్రభ సకల జీవుల చైతన్యప్రభ, సూర్యమండల మధ్యవర్తి శ్రీమన్నారాయణుడే. అందుకే సూర్యున్ని సూర్యనారాయణుడు అని కొలుస్తున్నాం. ఇంతటి మహాతేజఃపూర్ణమైన సూర్యప్రభ వాహనంలో ఉండే సూర్యనారాయణుడిని దర్శిస్తే ఇతోధిక భోగభాగ్యాలు, సత్సంతాన సంపదలు, ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి.