తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో శుక్రవారం ఆన్‌లైన్ కల్యాణోత్సవ సేవ ప్రారంభమైంది. మొదటిరోజు 118 మంది గృహస్తులు(ఇద్దరు) ఆన్‌లైన్ టికెట్లు బుక్ చేసుకుని ఈ సేవలో పాల్గొన్నారు. కోవిడ్ – 19 నిబంధనల నేపథ్యంలో శ్రీవారి ఆలయంలో ప్రతిరోజూ ఏకాంతంగా కల్యాణోత్సవం నిర్వహిస్తున్నారు. భక్తుల కోరిక మేరకు ఆన్‌లైన్ విధానంలో ఈ సేవను ప్రారంభించారు. ఇందులో గృహస్తుల గోత్రనామాలను అర్చకస్వాములు స్వామివారికి నివేదించారు. ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారం ద్వారా గృహస్తులు తమ ఇళ్ల నుండి కల్యాణోత్సవంలో పాల్గొన్నారు.
ఆగస్టు 7 నుండి 31వ తేదీ వరకు గల కల్యాణోత్సవం టికెట్లను ఆగస్టు 6వ తేదీన ఆన్ లైన్‌లో టిటిడి భక్తులకు అందుబాటులో ఉంచింది. కాగా, ఆగస్టు 8వ తేదీ కల్యాణోత్సవానికి గాను శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల వరకు ఆన్‌లైన్‌లో 496 టికెట్లను గృహస్తులు బుక్ చేసుకున్నారు. ప్రతిరోజూ రాత్రి 11.59 గంటల వరకు మరుసటి రోజుకు గాను టికెట్లు బుక్ చేసుకోవచ్చు. టికెట్లు బుక్ చేసుకునే గృహస్తులకు ఉత్తరీయం, రవిక, అక్షింతలు, కలకండ ప్రసాదాన్ని తపాలా శాఖ ద్వారా వారి చిరునామాకు పంపుతున్నారు.