తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో జూలై 31న వర్చువల్ విధానంలో జరుగనున్న వరలక్ష్మీ వ్రతం ఆన్‌లైన్ టికెట్లను బుక్ చేసుకున్న భక్తులకు బట్వాడా చేసేందుకు సిద్ధం చేసిన పూజాసామగ్రికి బుధవారం సాయంత్రం ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ముందుగా టిటిడి ఎఫ్ఎ అండ్ సిఏఓ శ్రీ ఓ.బాలాజి ఆలయ అధికారులు, అర్చకులతో కలిసి పూజాసామగ్రిని ఆలయ ప్రదక్షిణగా ఊరేగింపుగా తీసుకెళ్లారు. ఆ తరువాత అమ్మవారి మూలవిరాట్టు పాదాల వద్ద ఉత్తరీయం, రవిక, పసుపు, కుంకుమ, గాజులు, అక్షింతలు, కంకణాలు ఉంచి పూజలు చేశారు. టికెట్లు బుక్ చేసుకున్న గృహస్తుల గోత్రనామాలను అర్చకస్వాములు అమ్మవారికి నివేదించారు. అనంతరం ఈ పూజాసామగ్రిని గృహస్తులకు బట్వాడా చేసేందుకు పోస్టల్ అధికారులకు అందజేశారు.
జూలై 31వ తేదీ శుక్రవారం ఉదయం 10 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు వరలక్ష్మీ వ్రతం ఎస్వీబీసీలో ప్రత్యక్ష ప్రసారమవుతుంది. వ్రతంలో పాల్గొనే భక్తులు అర్చక స్వాముల సూచనల మేరకు తమ గోత్రనామాలతో సంకల్పం చెప్పాల్సి ఉంటుంది.