తిరుమలలో హనుమజ్జయంతిని ఆదివారం నిర్వహించారు. ప్రతి సంవత్సరం వైశాఖ బహుళ దశమినాడు తిరుమలలో హనుమజ్జయంతిని నిర్వహిస్తున్న విషయం విదితమే. ఈ సందర్భంగా శ్రీవారి ఆలయానికి ఎదురుగానున్న శ్రీ బేడి ఆంజనేయస్వామివారికి, కాలినడక మార్గంలోని ఏడో మైలు వద్ద ఉన్న శ్రీ ప్రసన్న ఆంజనేయస్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా తిరుమలలోని ధర్మగిరి వేద విజ్ఞానపీఠం ఆధ్వర్యంలో నాదనీరాజనం వేదికపై “యోగవాశిస్టం – శ్రీ ధన్వంతరి మహామంత్రం” పారాయణంలో భాగంగా 38వ రోజైన ఆదివారం ఉదయం అదనపు ఈవో శ్రీ ఏ.వి.ధర్మారెడ్డి పాల్గొన్నారు. హనుమజ్జయంతి పర్వదినాన్ని పురస్కరించుకుని పదకవితా పితామహుడు శ్రీమాన్ తాళ్ళపాక అన్నమయ్య హనుమంతునిపై రచించిన దివ్య కీర్తనలను అన్నమాచార్య ప్రాజెక్టు సీనియర్ కళాకారులు శ్రీ బి.రఘునాధ్ బృందం ఆలపించారు.
అనంతరం శ్రీవారి ఆలయానికి ఎదురుగానున్న శ్రీ బేడి ఆంజనేయస్వామివారి ఆలయంలో ఉదయం 9.00 గంటలకు ప్రత్యేక పూజలు, అభిషేకం నిర్వహించారు. మొదటి ఘాట్‌రోడ్డులోని ఏడవమైలు వద్ద ఉన్న శ్రీ ప్రసన్న ఆంజనేయస్వామి నిలువెత్తు విగ్రహానికి మధ్యాహ్నం 3.00 గంటలకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు.
తిరుమలలోని జాపాలి శ్రీ ఆంజనేయస్వామివారికి టిటిడి పట్టు వస్త్రాలు సమర్పణ
తిరుమలలోని జాపాలి తీర్థంలో గల శ్రీ ఆంజనేయస్వామివారికి హనుమజ్జయంతి సందర్భంగా టిటిడి తరపున పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు.
కారోనా వైరస్ వ్యాప్తి నివారణ చర్యలలో భాగంగా శ్రీ ఆంజనేయస్వామివారికి అభిషేకం, పూజ కార్యక్రమాలను ఏకాంతంతగా నిర్వహించారు.