పంచ రుణాలు అంటే ఏమిటి? పంచ రుణాల నుంచి విముక్తి పొందే మార్గాలు ఏమిటి?


గృహస్థుని జీవిత కాలం లో పంచ రుణాల గురించి విముక్తి పొందే మార్గాలను ఆచారరూపం లో నిక్షేపించి నిర్దేశింపబడింది. ఆ పంచ రుణాలు ఏంటో, ఆ పంచ ఋణాల నుంచి విముక్తిని పొందే మార్గాలను ప్రతి గృహస్థుడు ఏ విధంగా ఆచరించాలో ఒక ఆచారాన్ని నిర్దేశించింది ధనుర్మాసం. వాటి నుండి ఈ సంక్రాంతి సమయంలో చేసే పూజాది కార్యక్రమాల వల్ల మనకు తీరే రుణాలు ఏంటో తెలుసుకుందాం…





దేవ రుణం





త్రిమూర్తి స్వరూపుడైన సూర్య భగవానుణ్ణి సకల పోషకుడిగా, వేడి వెలుతురూ, ఆరోగ్యం ప్రసాదించే దైవం గా జ్ఞాన భాస్కరుడుగా, యుద్దాదిపతిగా మన సంస్కృతి లో ఆరాదిస్తున్నాం. ఇంద్ర, వరుణ, వాయుదేవతల సహాయం తో సూర్యుడు భూమి పై వర్షించడం వల్లనే మకర సంక్రాంతి పండుగ నాటికి పంటలు పండి మన చేతికి అందుతాయి. అందరి జీవన నిర్వహణ జరుగుతోంది. అందుకే సంక్రంతి నాడు తలంటుస్నానం చేసి, సూర్యాది దేవతలను పూజించి కొత్త బియ్యం తో పొంగులు వారే పొంగలి , పులగం తయారు చేసి, పాలను పొంగించి సూర్యభగవానుడికి భక్తి తో కృతఙ్ఞతలు నివేదించడం ఆచరమైంది.





పితృ రుణం





పితృ తర్పణాలు, పిండోదక దానాలు, శ్రాద్ధ కర్మలు మొదలైనవి ఆచరించడం ద్వారా మరణించిన పితరుల రుణం కొంతైనా తీరుతుందని విశ్వసిస్తారు. మకర సంక్రాంతి నాడు తెలకపిండిని ఒంటికి రాసుకొని స్నానం చేయడం ఆచారం. ఎందుకంటే మకర రాశికి శని అధిపతి. శని వాత ప్రధాన గ్రహమని చెప్పబడింది. వాతం తగ్గాలంటే సంక్రాంతి నాడు తెలకపిండి తో స్నానం చేసి, నువ్వులు బెల్లం గుమ్మడి కాయ మొదలైన దానాలు ఇవ్వడమే ఇందుకు పరిహారం అని చెబుతారు. నువ్వులు, బెల్లం తో చేసిన అరిసెలు మొదలైనవి తింటారు





భూత రుణం





భూమి, నీరు, గాలి మొదలైన భూతాలూ కరుణించడం వల్లనే పంటలు పండుతాయి. అందుకే కృతజ్ఞతా తో వాటిని కూడా పూజిస్తాం. పండిన పొలాల్లో పొంగలి మెతుకు, పసుపు కుంకం చల్లి ఎర్ర గుమ్మడికాయను పగల కొట్టి దిష్టి తీయడం ఆచరమైంది. పాడి పశువులు పాలిచ్చి మనల్ని పోషిస్తున్నాయి. ఎద్దులు వ్యవసాయం లో శ్రమిస్తున్నాయి. అందుకే కృతజ్ఞతాసూచకంగా కనుమ నాడు పశువులను, పశుశాలలను శుభ్రం చేసి అలంకరిస్తారు. వాటికి కూడా పొంగళ్ళు తినిపిస్తారు. ఇంటి ముంగిళ్ళలో బియ్యం పిండి తో ముగ్గులు వేస్తారు, ఆ పిండి క్రిమికీతకాదులకు ఆహారం గా ఉపయోగపడుతుందని. ఇలా మూగ జీవులకు, భూమి మొదలైన భూతాలకు మానవాళి కృతఙ్ఞతలు తెలిపే ఆచారాలను ఈ పండుగలో నిబద్దం చేసారు.





మనుష్య రుణం





ఇతరుల సహాయ సహకారాలు లేనిదే సమాజం లో జీవనం కొనసాగించలేము. అందుకు కృతజ్ఞతగా పండుగనాడు దాన్యం, తిలలు, కర్రలు, చెరుకు, గోవులు, పళ్ళు, వస్త్రాలు మొదలైనవి విరివిగా దానధర్మాలు చేస్తారు. అతిథులను ఆహ్వానిస్తారు వ్యవసాయం లో సహాయం చేసిన వారికి, ఇతర వృత్తులవారికి కొత్త ధాన్యాన్ని పంచి పెట్టడం కూడా ఈ పండుగలోని మరో ఆచారం .





ఋషి రుణం





ఈ పండుగ సమయం లో ఆచరించే జపతపధ్యానాది ఆధ్యాత్మిక సాధనాలు, సద్గ్రంధ పఠనాలు శీఘ్ర ఫలితానిస్తాయని విశ్వసిస్తారు. ఈ సంక్రమణ కాలం లో ధాన్యం, ఫలాలు, అజినం, కంచు, బంగారం వంటి లోహాలు దానం చేయడం ఉత్తమం. ఈ రోజు ఆచరించే దానాలలో ఘ్రుత కంబళి దానం శ్రేష్ఠమైనది. మూడున్నర వందల ప్రస్థములు పేరిన ఆవు నెయ్యి ని ఘ్రుత కంబళమని చెప్పబడింది. ఇంట నేయిని సేకరించలేని వారు అర లేక పావు వంతైనా సేకరించి మహేశ్వరుని మొదట ఇతర ఘ్రుతముతో అభిషేకించి పిదప ఈ ఘనీభూతమైన ఘ్రుత కంబళమును శివుని మస్తకము పై అర్పించాలి. తదుపరి దీని బ్రాహ్మణునికి దానం ఇవ్వాలి..