శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు సెప్టెంబరు 29వ తేదీ ఆదివారం రాత్రి 7.00 నుండి 8.00 గంటల వరకు శాస్త్రోక్తంగా అంకురార్పణం జరుగనుంది. సెప్టెంబరు 30 నుంచి అక్టోబరు 8వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగనున్న విషయం తెలిసిందే.
వైఖానస ఆగమంలోని క్రతువుల్లో అంకురార్పణం లేదా బీజవాపనం అత్యంత ముఖ్యమైనది. ఏదైనా ఉత్సవం నిర్వహించే ముందు అది విజయవంతం కావాలని కోరుతూ స్వామివారిని ప్రార్థించేందుకు అంకురార్పణం నిర్వహిస్తారు. ఇందులో భాగంగా శ్రీవారి తరపున సేనాధిపతి అయిన శ్రీ విష్వక్సేనులవారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపుగా వెళ్లి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పర్యవేక్షిస్తారు. అనంతరం అంకురార్పణ కార్యక్రమాల్లో భాగంగా ఆలయంలో భూమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించి పుట్టమన్నులో నవధాన్యాలను నాటుతారు. నవధాన్యాలకు మొలకలొచ్చేవరకు నీరు పోస్తారు. అంకురాలను ఆరోపింపజేసే కార్యక్రమం కాబట్టి ఇది అంకురార్పణం అయింది. అంకురార్పణ ఘట్టం తరువాత రంగనాయకుల మండపంలో ఆస్థానం నిర్వహిస్తారు.
అంకురార్పణం అంటే విత్తనం మొలకెత్తడం. శాస్త్రాల ప్రకారం ఉత్సవానికి తొమ్మిది రోజుల ముందు అంకురార్పణం నిర్వహిస్తారు.
అంకురార్పణం – విశిష్టత
శాస్త్రాల ప్రకారం ఏదైనా ఉత్సవానికి 9, 7, 5, 3 రోజులు లేదా ఒక రోజు ముందు అంకురార్పణం నిర్వహించడం ఆనవాయితీ. ఖగోళశాస్త్రంలోని సిద్ధాంతాల ప్రకారమే ఇలా చేస్తారు. మొక్కలకు అధిదేవత చంద్రుడు కాబట్టి రాత్రి సమయంలోనే విత్తనం నాటుతారు.
ఆగమాల ప్రకారం విత్తనం బాగా మొలకెత్తడాన్ని ఉత్సవం విజయవంతానికి సూచికగా భావిస్తారు. పాలికలు అనే పాత్రలను విత్తనాలను నాటేందుకు వినియోగిస్తారు. బ్రహ్మపీఠాన్ని బియ్యం తదితరాలతో అలంకరించిన తరువాత బ్రహ్మ, గరుడ, శేష, సుదర్శన, వక్రతుండ, సోమ, శాంత, ఇంద్ర, ఇసాన మరియు జయ తదితర దేవతలను ఆహ్వానించి అగ్ని ద్వారా పూజలు చేస్తారు. ఆ తరువాత సోమం రాజ మంత్రాన్ని, విష్ణుసూక్తాన్ని పారాయణం చేస్తారు. విత్తనాలు నాటే సమయంలో వరుణ మంత్రాన్ని పఠించి నీళ్లు చల్లుతారు.