శ్రీశైల క్షేత్రంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో తొమ్మిదవరోజు అయిన
మంగళవారం శ్రీభ్రమరాంబ మల్లికార్జునస్వామి వార్లకు రథోత్సవ సేవను అంగరంగ వైభవంగా నిర్వహించారు. మహాశివరాత్రి పర్వదినాన వధూవరులైన
శ్రీస్వామి అమ్మవార్లను మరుసటిరోజు వెండి పల్లకీలో రథశాల వద్దకు తీసుకువచ్చి, రథాంగహోమం, రథాంగ బలి సమర్పించి రథంపై ఆశీనులను గావించారు. వేలాది మంది భక్తజనుల శివనామస్మరణ నడుమ శ్రీస్వామిఅమ్మవార్లకు శ్రీగిరి పురవీధుల్లో రథోత్సవం కన్నుల పండువగా జరిగింది. రథోత్సవం ఎదుట కళాకారులు నృత్యప్రదర్శనలతో అలరించారు.
కన్నులపండువగా తెప్పోత్సవం
అలాగే రాత్రి 8 గంటలకు తెప్పోత్సవం కన్నులపండువగా నిర్వహించారు. ముందు రోజు చండీశ్వరుడి ప్రభోత్సవం జరిగింది. మార్చి 6 బుధవారం ఉదయం 9.30 గంటలకు రుద్ర, చండీహోమాలకు పూర్ణాహుతి నిర్వహించి.. వసంతోత్సవం, కలశోద్వాసన, త్రిశూల స్నానం తదితర విశేష కార్యక్రమాలు నిర్వహించారు. రాత్రి 7.30 గంటలకు ధ్వజపటాన్ని అవరోహణ చేస్తారు. 7వ తేదీ గురువారం శ్రీభ్రమరాంబామల్లికార్జున స్వామివార్లకు పుష్పోత్సవ, శయనోత్సవ, ఏకాంత సేవలు నిర్వహిస్తారు.