గోదా రంగనాథుల కళ్యాణం ఎప్పుడు నిర్వహిస్తారు? విశిష్టత ఏమిటి?


గోదా రంగనాథుల కళ్యాణానికి ఒక విశిష్టత ఉంది. సాధారణంగా సీతా రామ కళ్యాణమని, శ్రీనివాస కళ్యాణమని ఇలా ఎన్నో కళ్యాణోత్సవాలు జరుపుకుంటుంటాం. మిగతా కళ్యాణాలతో పోల్చితే. శ్రీనివాసుని కళ్యాణోత్సవంలో స్వామికి వైభవం, సీతారామ కళ్యాణంలో కూడా స్వామికే వైభవం కానీ గోదా రంగనాథుల కళ్యాణంలో వైభవం అంతా అమ్మ గోదాదేవికే. ఎందుకని ? ధనుర్మాసం చివరిరోజైన భోగి రోజున గోదా రంగనాధుల కళ్యాణోత్సవాలను ప్రతీ వైష్ణవ క్షేత్రంలోను వైభవోపేతంగా నిర్వహిస్తారు.





ఆశాశ్వతమైన మానవ జన్మ ఎత్తినా, ప్రాపంచిక ప్రలోభాలకులోనవ్వక జగద్రక్షకుడైన జగన్నాధుని తన హృదయ పీఠంలో నిలుపుకొని ఆయన దివ్య చరితాన్ని, మహత్తును తన పాశురాల ద్వారా లోకానికి అందించిన మహనీయమూర్తి గోదాదేవి. పెరియాళ్వార్ దత్త పుత్రిక ఆండాళ్, గోదాదేవి(భూమినుండి పుట్టినది)గా ప్రసిద్ధురాలు. ఈమె రచించినదే "తిరుప్పావై". ఈమె భూదేవి అంశగా పేర్కొంటారు. తన నిష్కల్మషమైన భక్తి ద్వారా ఆ రంగనాధుని చేరుకోగలిగింది గోదామాత.





గోదా ప్రబంధము





గోదాదేవి అద్భుతమైన వ్రతాన్ని ఆచరించి, ఆ ఆచరించిన దాన్ని మన దాకా ఆచరించేట్టుగా చేసింది అందుకే "పాడియరుళవల్ల పల్-వళై యాయ్" అని అంటుంటాం కదా. తాను ఆచరించిన దాన్ని ఎంతో కాలం దాక ఆచరించగలిగేట్టుగా ప్రబంధాన్ని అందించింది. అది గోదా దేవి గొప్పతనం. ఇది వరకు ఇలాంటి వ్రతాన్ని గోపికలు చేసారు కానీ వారు తరువాతి వారికి ఏమి అందించలేదు. శ్రీకృష్ణుని అనుభవాన్ని పొంది ఊరుకున్నారు తప్ప.





సీతమ్మ రామచంద్రునివివాహమాడి ఊరుకుంది, పద్మావతి అమ్మవారు శ్రీనివాసుని వివాహమాడి ఊరుకుంది, కానీ గోదాదేవి ఒక్కో పాటలో మనం ఏంతెలుసుకోవాలి, ఎలా తెలుసుకోవాలి, ఎలా ఆచరించాలో చెప్పింది. సీతమ్మ కానీ పద్మావతి అమ్మవారు కానీ భగవంతుని తనవంటి కదిలే రూపంలోనే వివాహ మాడారు వారి అవతారాల్లో. కానీ గోదా దేవి మానవకన్యగా ఉంటూ విగ్రహ స్వరూపుడైన రంగనాథుని వివాహమాడింది. తన ఆచరణతో విగ్రహ స్వరూపుడైన భగవంతుని కదిలేట్టు చేసుకుంది.





భక్తితో భగవంతుని కదిలించింది





మన ఎదురుగుండా కనిపించే విగ్రహాన్ని, అది దైవమని విశ్వసించి, మనం చెప్పినట్లుగా మనం పిలిచినట్లుగా అది కదలగలుగుతుంది పలకగలుగుతుంది అనే విశ్వాసాన్ని ఆండాళ్ తల్లి నిరూపించి చూపించింది. "ఉలగనిల్ తోత్రమాయ్ నిండ్ర శుడరే తుయిలెరాయ్", అంది అమ్మ అంటే "లోకంలో కంటికి కనిపించేట్టుగా విగ్రహరూపంలో ఉండే భగవంతుడా! ఆ విగ్రహ రూపంలో నీ ప్రభావము అనుపమానము, అసమానము అని విశ్వసిస్తున్నాను" అని చెప్పి భగవంతుని కదిలేట్టు చేసింది.





మూడు పనులు చేసి విగ్రహరూపంలో ఉండే భగవంతుని కదిలేట్టు చేసింది. అవి "కృష్ణమ్ ఉద్భోధ్య", "కృష్ణమ్ అధ్యాపయంతి" మరియూ "కృష్ణమ్ బలాత్కృత్య భూంక్తే". ఆయన ఏమి ఉలకకుండా పడుకుంటే మేల్కొల్పింది. చిన్న పిల్లవాడికి బెత్తం చూపి పాఠం చెప్పినట్లుగా, మనల్ని బాగుచేయడానికి, మనం తెలుసుకోవలసిన విషయాలని మనకి ఆయన ఎట్లా తెలిసేట్టు చేయాలో ఆయనకి పాఠాలు నేర్పింది. అంతే కాదు స్వామి విగ్రహరూపంలో ఉన్నా ఆయన్ని నిర్బంధించి, బంధించి, ఆయన్ని పొందింది.





అందుకే ఎక్కడో శ్రీవిల్లిపుత్తూరులో ఆండాళ్ ఉంటే, శ్రీరంగంలో ఉన్న స్వామి స్పందించి అర్చకులని, రాజుని అమ్మని తీసుకురమ్మని ప్రేరేపించి రప్పించుకున్నాడు. విగ్రహంలో ఉన్న స్వామితో వివాహమని తెలియగానే జనాలు తండోపతండాలుగా తరలి వచ్చి ఆశ్చర్యపోయినందుకే ఆ వీధికి చిత్ర వీధి అనే పేరు ఏర్పడిపోయింది. తరువాత వీధి ఉత్తరవీధి, అక్కడ ఉన్న స్వామి అమ్మని వివాహమాడి గోదాదేవిని తనలో చేర్చుకున్నాడు. మానవకన్యగా ఉన్న ఆండాళ్ తల్లిని ఉత్సవ మూర్తిగా మలచి తానూ ఉత్సవ మూర్తిగా కలిసి ఉన్నాడు శ్రీవిల్లిపుత్తూరులో, అమ్మ ఆదేశాన్ని బట్టి.





అమ్మ రామచంద్రుని ఇలవేల్పుఅయిన శ్రీరంగనాథుని వివాహమాడటంతో సీతారాములకే ఇలవేల్పు అయ్యింది. సీతారాములకి తరువాతి కాలంలో అవతరించినా వారికి ఇలవేల్పు అవడం అమ్మ గొప్పతనం.