ఈ సందర్భంగా శ్రీమలయప్పస్వామివారు ఆలయ ప్రదక్షిణంగా వాహనమండపానికి వేంచేపు చేస్తారు. తిరుమలనంబి ఆలయం నుండి ప్రదక్షిణంగా తిరుమలనంబి వంశీకులు శిరస్సుపై బిందెల్లో ఆకాశగంగ తీర్థాన్ని వాహనమండపానికి తీసుకొస్తారు. అక్కడినుండి వేదమంత్రోచ్ఛారణ నడుమ జీయర్ స్వాములు, ఆచార్య పురుషులు, ప్రబంధ పండితులు పవిత్ర తీర్థ జలంతో ఆలయంలోనికి వేంచేపు చేస్తారు. అనంతరం తిరుమలనంబి వంశీకులు స్వామివారి మూలవిరాట్టు పాదాలపై అమరి ఉన్న బంగారు తొడుగునకు పవిత్ర ఆకాశగంగ జలంతో అభిషేకం చేస్తారు. ఈ సందర్భంగా వైదికులు తిరుమలనంబి రచించిన ”తిరుమొళి పాశురాలను” పారాయణం చేస్తారు.
తన్నీరముదు ఉత్సవం పౌరాణిక ప్రాశస్త్యం
పౌరాణిక ప్రాశస్త్యం మేరకు శ్రీ తిరుమలనంబి క్రీ.శ. 973వ సంవత్సరంలో పవిత్ర పురట్టాసి మాసంలో అనూరాధ నక్షత్రంలో జన్మించారు. వీరు సాక్షాత్తు శ్రీ భవగవత్ రామానుజాచార్యులవారికి మేనమామ. ప్రతిరోజూ పాపవినాశతీర్థం నుండి కుండలో నీరు తీసుకొచ్చి శ్రీవారి ఆలయంలో స్వామివారికి దైనందిన పాదపూజ నిర్వహించేవారు. ఒకరోజు తిరుమలనంబి యధాప్రకారం స్వామివారి సేవ కోసం పాపవినాశనం నుండి జలాన్ని కుండలో మోసుకొని వస్తుండగా సాక్షాత్తు శ్రీవేంకటేశ్వరస్వామి వేటగాని రూపంలో వచ్చి నంబిని ”తాతా” (అయ్యా) అని పిలుస్తూ దాహం తీర్చుకోవడానికి ఆ బిందెలోని నీటిని కోరాడు. తిరుమలనంబి ఇవ్వకపోవడంతో బిందెకు రంధ్రం చేసి ఆ నీటిని తాగి వేటగాని రూపంలో ఉన్న స్వామి సంతృప్తి పొందాడు.
ఈ చర్యతో ఖిన్నుడైన తిరుమలనంబిని చూసి స్వామి ఓదార్చుతూ సమీపంలో ఉన్న కొండపై బాణం వేసి అందులోనుండి తీయని పానీయం వచ్చేలాగా చేసాడు. నంబిని ఉద్దేశించి స్వామి మాట్లాడుతూ ”ఇకపై ఈ తీర్థ జలాన్నే నాసేవకు ఉపయోగించాలని పలికి” అంతర్థానమయ్యారు. అప్పుడు తనకు ప్రత్యక్షమైన వ్యక్తి సాక్షాత్తు శ్రీవేంకటేశ్వరస్వామివారేనని తిరుమలనంబి గ్రహించి ఎంతో ఆనందం చెందాడు. అప్పటి నుండి ఈ తీర్థానికి ఆకాశగంగ అనే పేరు వచ్చింది. ఈ తీర్థం నీళ్లు తీపిగా, అమృతమయంగా ఉండడంతో ”తన్నీరముదు” అని కూడా వ్యవహరించడం జరిగింది.
భగవత్ శ్రీ రామానుజాచార్యులవారు సుమారు 1000 సంవత్సరాల క్రిందట శ్రీవారి ఆలయంలో తన్నీరముదు ఉత్సవాన్ని తిరుమలనంబి స్వామివారికి అందించిన విశేషసేవల జ్ఞాపకార్థం ప్రవేశపెట్టారు. అప్పటినుండి తిరుమలనంబి(తాతాచార్య) వంశస్థులు ప్రతి ఏడాదీ తిరుమలలో ఈ ఉత్సవాన్ని నిరంతరాయంగా నిర్వహిస్తున్నారు.
Source