పైడిమాంబ తల్లి చరిత్ర
పైడిమాంబ తల్లి గజపతుల వంశానికి చెందిన రాజుల ఆరాధ్య దేవత. ఆ ఇంటి ఆడపిల్లలకూ ఆమె పేరు పెట్టుకునేవారు. పదిహేడో శతాబ్దం వరకు విజయనగరం, బొబ్బిలి సంస్థానాలు మైత్రితో మెలిగేవి. విదేశీయుడైన బుస్సీ దొర కుట్ర, ఇరు పక్షాల యుద్ధానికి దారితీసింది. దాన్ని ఆపి నష్టం నివారించాలని ఆ ఇంటి ఆడపడుచు పైడిమాంబ ఎంతగానో ప్రయత్నించింది. ఆమె అన్న- బొబ్బిలి సేనాధిపతి చేతిలో హతమయ్యాడనే వార్త చెవిన పడటంతో, కుప్పకూలి ప్రాణాలు విడిచింది. అదే రాత్రి ఆ కుటుంబ శ్రేయోభిలాషికి కలలో కనిపించి- దేవిలో లీనమయ్యానని, ప్రజలంతా సామరస్యంతో ఉంటే దేవతామూర్తిగా మళ్లీ అవతరిస్తానని, గుడి కట్టి ప్రతిష్ఠిస్తే అందరూ సుఖశాంతులతో వర్ధిల్లేట్లు చూస్తానని చెప్పిందట. ధాత నామ సంవత్సరంలో విజయదశమి గడచిన తరవాతి మంగళవారం పెద్దచెరువు (రాజుల విహార సరోవరం)లో చేపల వేట సాగిస్తున్న జాలరుల వలకు చిక్కి, ప్రతిమ రూపంలో ఆ తల్లి బయటకు వచ్చిందని చెబుతారు. ఆ విగ్రహాన్ని అక్కడే గట్టున ప్రతిష్ఠించి, ఆలయం కట్టారు.
వనం గుడి
పైడిమాంబ తల్లి వనం (నీరు) నుంచి బయటపడిన దేవత గుడి కాబట్టి ఆ ఆలయాన్ని ‘వనం గుడి’గా భావిస్తారు. మరొక కథనం ప్రకారం, ఆనాటి వనం (తోట) ప్రాంతంలో కట్టిన ఆలయం కావడంతో ఆ పేరు వచ్చిందంటారు. రాజుల ఆడపడుచు అయిన పైడిమాంబనే అప్పటి నుంచి అమ్మవారి ప్రతిరూపంగా కొలుస్తున్నారని ప్రతీతి. ఆ తరవాతి సంవత్సరం నుంచే ఉత్సవాలు జరుపుతున్నారు. ఆమె పుట్టినిల్లయిన కోటకు దగ్గరలో చదురు గుడి నిర్మించారు. చదురు అంటే- నివాసం లేదా కొలువైన ప్రదేశం. ఏటా వైశాఖ శుక్ల దశమినాడు వనం గుడి నుంచి అమ్మవారిని చదురు గుడికి తీసుకు వస్తారు.పైడిమాంబ తల్లి ఉత్సవాల్లో ప్రత్యేక ఘట్టాలు
నెలరోజులు జరిగే ఉత్సవాల్లో అయిదు ప్రధాన ఘట్టాలు ఉంటాయి. అవి- తొలేళ్లు, సిరిమాను, తెప్పోత్సవాలు; ఉయ్యాల- కంబాల, చండీయాగం-పూర్ణాహుతి ఉత్సవాలు. మంగళవారం జరిగే ప్రధాన ఘట్టం- సిరిమాను ఉత్సవం. అమ్మవారు తనకు సిరిమాను కానున్న చెట్టు గురించి కలలో చెబుతుందంటారు. ఆ చింతచెట్టును సిరిమానుగా మలచి, చివర పూజారి కూర్చుంటారు. అమ్మవారు ఆ సమయంలో ఆయనను ఆవహించి ఉంటుందన్న విశ్వాసంతో, సిరిమాను రథాన్ని చదురు గుడి నుంచి కోట వరకు మూడుసార్లు తిప్పుతారు. ఈ దృశ్యాన్ని లక్షలాది భక్తులు తిలకించి పులకిస్తారు.పైడిమాంబ తల్లి ఉత్సవాల్లో రథాల ప్రాముఖ్యత
సిరిమాను రథానికి ముందు నాలుగు రథాలు నడుస్తాయి. మొదటిది, అమ్మవారి విగ్రహాన్ని వెలికితీసినవారికి కృతజ్ఞతగా నడిచే బెస్తల రథం. రెండోది, పాలకులను రక్షించడానికి కృషిచేసిన సైనికుల కుటుంబీకులు ఉండే పాలధార రథం. మూడోది, గజపతుల వంశానికి ప్రీతిపాత్రమైన తెల్ల ఏనుగు ప్రతిరూప రథం. నాలుగోది, పైడిమాంబకు పరిచర్యలు చేసిన పరిచారికలను స్మరించుకునే అంజలి రథం. వాటి వెనక సిరిమాను రథం సాగుతుంది. ఆ తరవాతి మంగళవారం తెప్పోత్సవం నిర్వహిస్తారు.దేవి ఉత్సవ విగ్రహాన్ని తెప్ప(చిన్న పడవ)లో ఉంచి, పెద్ద చెరువులో విహరింపజేస్తారు. ఆపై మంగళవారం జరిగేది- అమ్మవారిని ఉయ్యాలలో ఉంచి వూపే ఉయ్యాల-కంబాల ఉత్సవం. ఆ మరునాడు వనం గుడిలో వేదోక్తంగా చండీయాగం జరిపి, పూర్ణాహుతితో ఉత్సవాలకు ముగింపు పలుకుతారు. వూరూవాడా భక్తివిశ్వాసాల్ని పెంపొందించే ఇటువంటి జాతరలు ఆధ్యాత్మిక వికాసానికి, సామాజిక ఐక్యతకు ప్రతీకలు!