వరలక్ష్మీవ్రతంలో తోరం ఎందుకు కట్టుకోవాలి?

శ్రావణమాసంలో వరలక్ష్మి వ్రతం మహిళలకు కీలకమైన వ్రతం. ఈవ్రతం చేసుకోవాలంటే కొన్ని నియమనిష్టలు, విధివిధానాలు పాటించవలసి ఉంటుంది. ఈ వ్రతం మన పురాణాలు నిర్దేశించిన విధంగా సంప్రదాయ సిద్ధంగా జరుపుకుంటేనే ఫలితం దక్కుతుంది. వ్రతంలో కీలకమైన విధి తోరపూజ. వ్రతంలో వాడే తోరాలను తయారు చేసుకునేందుకు కూడా ఒక విధానం ఉంది. పూజలో భాగంగా వ్రతం చేసుకునే వారు విధిగా చేతికి ధరించాల్సిన ఈ తోరాన్ని ఎందుకు కట్టుకుంటారు? దీన్ని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందామా?

వరలక్ష్మీవ్రతం లో తోరం ప్రాముఖ్యత


అమ్మవారి అనుగ్రహం మన వెన్నంటే ఉంటూ, సకల విజయాలూ కలగాలని కట్టుకునేదే తోరం. ఇలా తోరం కట్టుకోవడమే క్రమంగా రాఖీ పండుగకు దారితీసిందని నమ్మేవారూ ఉన్నారు. వరలక్ష్మి అమ్మవారి పూజ కోసం కనీసం మూడు తోరాలను సిద్ధం చేసుకోవాలి. వీటిలో ఒకటి అమ్మవారికి, ఒకటి మనకు, ఒకటి ముత్తయిదువకు అన్నమాట. ఇలా సిద్ధం చేసుకునే తోరాన్ని నవసూత్రం అని పిలుస్తారు. ఆ పేరుని బట్టే ఇందులో తొమ్మిది దారాలు, తొమ్మిది ముడులు ఉంటాయని అర్థం చేసుకోవచ్చు. నవ అనే పదం కేవలం తొమ్మిది ముడులనే కాదు... నవగ్రహాలను, నవరత్నాలను, నవనాడులను, నవగ్రంథులను సూచిస్తుంది. అంటే తొమ్మిది ముడులు ఉన్న ఈ సూత్రంతో ఇహపరమైన విజయాలన్నీ సిద్ధిస్తాయన్నమాట!

https://www.youtube.com/watch?v=VR_ByQqyUco

వరలక్ష్మీవ్రతం కోసం తోరం తయారీ విధానం


ఈ నవసూత్రాన్ని తయారుచేసుకునేందుకు దారాన్ని తొమ్మిది పోగులుగా చేయాలి. అలా దగ్గరకు చేరిన తోరానికి పసుపు పూయాలి. ఆ తోరానికి తొమ్మిది చోట్ల కుంకుమ రాసి, అలా రాసిన చోట ఒక్కో పూవుని ఉంచుతూ తొమ్మిది ముడులు వేయాలి.

ఇలా సిద్ధమైన తోరాలను అమ్మవారి ముందు ఉంచి తోరగ్రంథిపూజ చేస్తారు. గ్రంథి అంటే ముడి అని అర్థం. తోరంలోని ఒకో ముడినీ అక్షతలతో కానీ, పూలతో కానీ పూజించడమే ఈ తోరగ్రంథిపూజ. ఇందుకోసం ఒకో ముడినీ పూజిస్తూ ఒకో మంత్రం చదవాలి.

  • ఓం కమలాయై నమ: ప్రథమగ్రంథిం పూజయామి

  • ఓం రమాయై నమ: ద్వితీయ గ్రంథిం పూజయామి

  • ఓం లోకమాత్రే నమ: తృతీయ గ్రంథిం పూజయామి

  • ఓం విశ్వజనన్యై నమ: చతుర్థ గ్రంథిం పూజయామి

  • ఓం మహాల క్ష్మైనమ: పంచమ గ్రంథిం పూజయామి

  • ఓం క్షీరాబ్దితనయామై నమ: షష్టమ గ్రంథిం పూజయామి

  • ఓం విశ్వసాక్షిణ్యై నమ: సప్తమ గ్రంథిం పూజయామి

  • ఓం చంద్రోసహోదర్యై నమ: అష్టమ గ్రంథిం పూజయామి

  • ఓం హరివల్లభాయై నమ: నవమ గ్రంథిం పూజయామి


ఈ తోరగ్రంథి పూజ ముగిసిన తర్వాత...

‘బధ్నామి దక్షిణేహస్తే నవసూత్రం శుభప్రదం
పుత్రపౌత్రాధివృద్ధించ మమసౌఖ్యం దేహిమే రమే’


అనే శ్లోకాన్ని చదువుతూ ఆ తోరాన్ని ధరించాలి.

పై శ్లోకంలో దక్షిణేహస్తే అని స్పష్టంగా ఉంది. అంటే తోరాన్ని తప్పకుండా కుడిచేతికే ధరించాలన్నమాట. అంతేకాదు! చాలామంది ఇలా ధరించిన తోరాన్ని పూజ ముగిసిన వెంటనే తీసేస్తుంటారు. కానీ తోరాన్ని కనీసం ఒకరాత్రి, ఒక పగలన్నా ఉంచుకోవాలని చెబుతారు పెద్దలు. అలా ధరించే తోరం సంతానాన్నీ, సంపదను, సౌభాగ్యాన్నీ ప్రసాదిస్తుంది.