కామ్యైకాదశి విశిష్ఠత 2018 : ఆషాఢ మాసంలో పర్వదినాలు

ఆషాఢ మాసంలో వచ్చే పర్వదినాలలో ఒకటి కామ్యైకాదశి. నిజానికి చాలామంది ఈ మాసంలో వచ్చే పర్వదినాల గురించి పట్టించుకోరు. ఆషాఢ బహుళ ఏకాదశినే కామ్యైకాదశి అంటారు. అంటే ఈ ఏకాదశినాడు చేసే దీక్ష మానవుల సకల కోర్కెలనూ తీరుస్తుందని పురాణాలు పేర్కొంటున్నాయి. అంటే మన కామ్యాలను తీర్చేదే కామ్యైకాదశి అన్నమాట. ఈ ఏకాదశిని మనం ఆగస్టు ఏడవతేదీ అంటే మంగళవారం రోజున జరుపుకోనున్నాం.

సంవత్సరంలో వచ్చే 24 ఏకాదశులలో ఇదొకటి. ఈసారి అధిక మాసం వచ్చింది కాబట్టి, మొత్తం 26 ఏకాదశులు. ఈ కామ్యైకాదశిని తెలుగు, కన్నడ, మరాఠీ, గుజరాత్ వారంతా జరుపుకుంటారు. కాగా, ఉత్తరాది వారికి మాత్రం ఇది శ్రావణ మాసంలో వస్తుంది. చాతుర్మాస వ్రతదీక్షలో భాగంగా రావడంతో ఈ కామ్యైకాదశికి ఎంతో ప్రాముఖ్యత ఉంది.

కామ్యైకాదశి పూజా విధానం


కామ్య ఏకాదశి రోజున చాలామంది హిందువులు అత్యంత నిష్ఠగా ఉపవాసం ఉంటారు. ప్రత్యేకించి తులసి దళాలతో ఆ రోజు శ్రీకృష్ణుని పూజిస్తారు. ఏమీ తినకుండా కేవలం నీళ్లు మాత్రమే తాగుతూ నీల్లారం పాటించేవారు కొందరైతే, ఆ నీళ్లు సైతం తాగకుండా పొద్దంతా ఉండేవారు మరి కొందరు. ఇంతటి కఠినమైన ఉపవాసాలు ఉండలేకపోయినా పాక్షిక ఉపవాసం చేయవచ్చు.

కామ్య ఏకాదశి రోజున తులసి చెట్టును విష్ణుమూర్తి స్వరూపంగా భావించి పూజిస్తారు. దీనివల్ల సకల పాపాలన్నీ నివృత్తి కావడమే కాకుండా ఎలాంటి రోగాలైనా తగ్గిపోతాయన్న నమ్మకం భక్తులకు ఉంది. తులసి చెట్టుకు నీళ్లు పోయడం ద్వారా మృత్యుభయం పోయి, యముని కోపం నుంచి రక్షణ లభిస్తుందని కూడా విశ్వసిస్తారు. అలాగే, ఈ పుణ్యం పితృదోషం నుంచి విముక్తుల్ని చేస్తుందని కూడా నమ్ముతారు. మర్నాడు ద్వాదశి రోజున దీక్షను విరమిస్తారు.

అన్ని కోర్కెల్ని తీర్చే పవిత్ర సమయం కాబట్టి, ఈ కామ్య ఏకాదశి నాటి రాత్రి కొందరు భక్తులు నిద్రకు దూరమై జాగరణలో కూడా ఉంటారు. రాత్రంతా శ్రీకృష్ణుని కీర్తనలు, భజనలు చేస్తూ గడుపుతారు. ఇంకొందరు విష్ణు సహస్రనామ పారాయణం చేస్తారు. ఓం నమో నారాయణాయ నమః అన్న మంత్రోపాసనతో రోజంతా పొద్దు పుచ్చేవారుంటారు. ఇంకొందరు తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాలనూ సందర్శిస్తారు. గంగ, యమున, గోదావరి, కృష్ణ, తుంగభద్ర వంటి పవిత్ర నదులలో పుణ్యస్నానాలు కూడా ఆచరిస్తారు. ఈవేళ విష్ణు దేవాలయాలు భక్తులతో కిక్కిరిసి పోతాయి.