వినాయక చవితి 2018: ఏకవింశతి పూజలో ఈ 21 పత్రాలతో పూజ చేయండి!

వినాయకచవితి నాడు చేసే పూజలో పత్రాలు ప్రధానమైనవి. విఘ్నేశ్వరుని 21 రకాల ఆకులతో పూజించాలని మన పురాణాలు చెబుతున్నాయి. వీటిలో ఒక్కటి తప్ప అన్నీ మన పరిసరాల్లో లభించేవే. మీరు బజారులో విక్రయించే నానా విధాలైన పత్రాలతో పూజచేసి అయిందనిపించు కోకుండా సాధ్యమైనన్ని పత్రాలు మనమే సేకరించుకుని ఏకవింశంతి పత్ర పూజ శాస్త్రయుక్తంగా చేసుకోండి.

వినాయకచవితి రోజున ఉపయోగించే 21 పత్రాలు



  • మాచీ పత్రం: మాచి పత్రిగా పిలుస్తాం. మనదేశంలో ప్రతీచోట కనిపిస్తుంది. మన ఇళ్ళ చుట్టుపక్కల ఇది విపరీతంగా పెరుగుతుంది.

  • బృహతీపత్రం: ఈ పత్రాన్ని మనం వాకుడాకు, నేలమునగాకు అని కూడా పిలుస్తూ ఉంటాం.

  • బిల్వ పత్రం: దీనికే మారేడు అని పేరు. పరమేశ్వరునికి అత్యంత ప్రీతికరమైనది.

  • దూర్వాయుగ్మం: అంటే గరిక ఇది ఎక్కడపడితే అక్కడ పెరుగుతుంది. దేవునికి వెసేప్పుడు రెండు పాయలుగా ఉండే గరికను వాడాలి.

  • దత్తూరపత్రం: దీనిని మనం ఉమ్మెత్త అని కూడా పిలుస్తాం. గ్రమాల్లో, చెరువగట్ల వద్ద, కాలువ గట్ట వద్ద, బీడుల్లో లభిస్తుంది.

  • బదరీపత్రం: ఓం లంబోదరాయ నమ: ‘బదరీపత్రం పూజయామి’ అంటూ గణపతికి బదరీపత్రం సమర్పించాలి. దీనినే రేగు అని పిలుస్తుంటాం. బదరీ వృక్షం సాక్షాత్తూ శ్రీమన్నారాయణుని స్వరూపం.

  • అపామార్గపత్రం: దీనికే ఉత్తరేణి అని పేరు. ఇది కూడా విరివిగా మన చుట్టుపక్కల లభించేదే. 'ఓం గుహాగ్రజాయ నమ: అపామార్గపత్రం పూజయామి' అంటూ ఈ పత్రంతో గణనాధునికి పూజచేయాలి.

  • తులసి: 'ఓం గజకర్ణాయ నమ: తులసి పత్రం పూజయామి’ అంటూ తులసిని గణపతికి అర్పించాలి. తులసి విష్ణుమూర్తికి ప్రీతికరమైనది. తులసి మొక్క లేని ఇల్లు ఉండరాదు అంటోంది మన సాంప్రదాయం.

  • చూత పత్రం: అంటే మామిడి ఆకు 'ఓం గజకర్ణాయ నమ: చూత పత్రం పూజయామి అంటూ ఈ పత్రాన్ని గణపతికి అర్పించాలి.

  • కరవీరపత్రం: దీనినే గన్నేరు ఆకు అంటారు. 'ఓం వికటాయ నమ:-కరవీరపత్రం పూజయామి' అంటూ గణపతికి ఈ పత్రం సమర్పించాలి.

  • విష్ణుక్రాంతపత్రం: మనం వాడుకభాషలో ఈ పత్రాన్ని అవిసె అంటాం. 'ఓం భిన్నదంతాయ నమ:-విష్ణుక్రాంత పత్రం పూజయామి' అని గణపతిని పూజించాలి.

  • దాడిమీపత్రం: దీనినే యనం దానిమ్మ అనిపిలుస్తాం. ‘ఓం వటవే నమ: దాడిమీ పత్రం పూజయామి’ అని ఈ పత్రాన్ని గణపతికి సమర్పించాలి.

  • దేవదారు పత్రం: ఇది వనములలో, అరణ్యములలో పెరిగే వక్షం. పార్వతీదేవికి మహా ఇష్టమైనది. చల్లని ప్రదేశంలో ముఖ్యంగా హిమాలయా పర్వతాల వద్ద పెరుగుతుంది ఈ వక్షం. మనకు పరిసరాల్లో లభించే అవకాశాలు లేవు. ఓం సర్వేశ్వరాయ నమ:-దేవదారు పత్రం పూజయామి అని గణపతికి సమర్పించాలి.

  • మరువక పత్రం: మనం దీన్ని వాడుక భాషలో మరువం అంటాం. ఇది అందరి ఇళ్ళలోనూ, అపార్టుమెంట్లలోనూ కుండీల్లో పెంచుకుంటారు. ఇది మంచి సువాసన గల పత్రం. ‘ఓం ఫాలచంద్రాయ నమ: మరువక పత్రం పూజయామి’

  • సింధువార పత్రం: దీనిని వావిలి ఆకు అంటారు. ఇది తెలుపు, నలుపు అని రెండు రకాలు. ఇది కూడా విస్తారంగా లభించ పత్రాలలో ఒకటి ‘ఓం హేరంభాయ నమ:-సింధువార పత్రం పూజయామి’ అని మంత్రిస్తూ వినాయకునికి ఈ పత్రం సమర్పించాలి.

  • జాజీపత్రం: ఇది అన్నిచోట్ల లభిస్తుంది. జాజిపూలు మంచి సువాసన కలిగిమనిషికి ఉత్తేజాన్ని, మనసుకు హాయిని కలిగిస్తాయి. ‘ఓం శూర్పకర్ణాయ నమ: జాజి పత్రం సమర్పయామి’ అని ఈ పత్రాన్ని దేవునికి అర్పించాలి.

  • గండకీ పత్రం: దీనినే మనం దేవకాంచనం అని పిలుస్తాం. అన్ని ప్రాంతాల్లోనూ లభిస్తుంది. ‘ఓం స్కంధాగ్రజాయ నమ: గండకీ పత్రం సమర్పయామి’ అంటూ బొజ్జగణపయ్యకు ఈ పత్రం సమర్పించాలి.

  • శమీపత్రం: దీని వ్యవహార నామం జమ్మి. మహాభారతంలో విరాటపర్వంలో పాండవులు దీనిమీదనే తమ ఆయుధాలను దాచిపెడతారు. ‘ఓం ఇభవక్త్రాయనమ: శమీపత్రం సమర్పయామి’ అని శమీపత్రం సమర్పించాలి

  • అశ్వత్థపత్రం: అందరికీ సుపరిచయమైన రావి చెట్టు. తులసి లేని ఇల్లు, వేపలేని వీధి, ఒక్క రావి చెట్టు కూడా లేని ఊరు ఉండరాదన్నది మన పెద్దల మాట. ఓం వినాయకాయ నమ: అశ్వత్థ పత్రం సమర్పయామి అంటూ ఈ చెట్టు పత్రాలతో వినాయకుని పూజించాలి.

  • అర్జునపత్రం: మనం దీన్నే మద్ది అంటాం. ఇది తెలుపు-ఎరుపు అని రెండు రంగులలో లభిస్తుంది. ప్రతీచోటా లభిస్తుంది. ‘ఓం సురసేవితాయ నమ: అర్జునపత్రం సమర్పయామి’ అని గణాధ్యక్షునికి సమర్పించాలి.

  • అర్కపత్రం: అర్క పత్రం అంటే జిల్లేడు ఆకు. జిల్లేడు చెట్టు గణపతి స్వరూపం. ప్రతీ గ్రామంలో ప్రతీ వీధిలో జిల్లేడు లభిస్తుంది. ‘ఓం కపిలాయ నమ: అర్కపత్రం సమర్పయామి’ అంటూ ఈ ఆఖరి పత్రం గణపతికి సమర్పించడం ద్వారా ఏకవింశతి పత్ర పూజ పరిసమాప్తమవుతుంది. చివరగా ఓం వరసిద్ధి వినాయక స్వామినే నమ:- ఏకవింశతి పత్రాణి సమర్పయామి అంటూ గణపతికి పత్ర పూజను ముగించాలి.