గరుడ పంచమి పూజా ఫలం
గరుత్మంతుడు తన తల్లికి దాస్యం నుంచి విముక్తి కలిగించడం కోసం దేవలోకం నుంచి అమృత కలశం తీసుకువచ్చాడు. అందుకోసం ఏకంగా ఇంద్రునితోనే పోరాడతాడు. తన సాహసంతో, మాతృభక్తితో సాక్షాత్తు శ్రీమహావిష్ణువు అభినందనలను అందుకుని ఆయన వాహనంగా స్ధానం సంపాదించాడు. అందుకే గరుత్మంతుని పుట్టిన రోజైన గరుడ పంచమినాడు-గరుడ పంచమి వ్రతాన్ని ఆచరించడం వలన, ఆరోగ్యవంతులైన, ధైర్యవంతులైన సంతానం కలుగుతుందని పెద్దల ఉవాచ.
గరుడ పంచమి పూజా విధానం
గరుత్మంతుడు వంటి మాతృభక్తి కలిగిన సంతానం కలగాలని గరుడ పంచమి వ్రతం చేస్తుంటారు. శ్రావణ శుద్ధ పంచమి నాడు, గరుత్మంతుడు జన్మించిన రోజు ఈ వ్రతం చేస్తారు. ఇంకా సంతానం లేని వారు, సంతానం కలగని వాళ్లు కూడా ఈ వ్రతాన్ని ఆచరిస్తే సంతాన ప్రాప్తి కలుగుతుందని మన పురాణ గ్రంధాలు పేర్కొంటున్నాయి.
వ్రత నియమాలు...
అయితే సోదరులు వున్న స్త్రీలు మాత్రమే ఈ వ్రతాన్ని ఆచరించాలనే నియమం వుంది. సౌభాగ్యంతో పాటు చక్కని సంతానాన్ని ఇచ్చే ఈ వ్రతంలో భాగంగా గరుత్మంతుని లాంటి సంతానాన్ని కలుగచేయాలని గౌరీదేవిని ప్రధానంగా పూజిస్తారు. సుపుత్ర ప్రాప్తికోసం విశేషమైనదిగా చెప్పబడుతోన్న ఈ వ్రతాన్ని పది సంవత్సరాల పాటు ఆచరించి, ఆ తరువాత ఉద్యాపన చెప్పుకోవలసి వుంటుంది.
పూజా విధానం అంతా మిగిలిన వ్రతాల మాదిరిగానే ఉంటుంది. ప్రత్యేకమైన వస్తు సామాగ్రి ఆవశ్యకత ఉండదు. ముందుగా విఘ్నేశ్వర పూజ, చేయాలి శోడశోపచార పూజలో భాగంగా కలశపూజ, ధూపదీప నైవేద్యాదులు గౌరీదేవికి సమర్పించాలి. తీపి పదార్ధాలు నైవేద్యంగా అర్పించి ముత్తయిదువులను సత్కరించుకోవాలి.
https://youtu.be/7E4n7Qw8yXA