కృష్ణలంక సాయిబాబా మందిరం

కృష్షా జిల్లా విజయవాడలోని కృష్ణలంకలోని భ్రమరాంబపురంలో పురాతన సాయిబాబా మందిరం ఉంది. ఆంధ్రప్రదేశ్‌ లోని మొట్టమొదటి సాయిబాబా మందిరం ఇదేనని తెలుస్తోంది. 1947 ఆగస్టునెలలో రాంపిళ్ళ లక్ష్మణరావుగారి చేతుల మీదుగా ఈ ఆలయ ప్రతిష్టాపన జరిగిందని చెబుతారు.

బాబా విగ్రహం 5.4 అడుగుల ఎత్తు ఉండి సిమెంటుతో చేయబడి ఉంది. భక్తుల రద్దీ పెరగడంతో 1992లో పునర్నిర్మాణం జరిగింది. సి.హెచ్‌.అశ్వనీదత్‌, వినయకుమారి బాబా పాలరాతి విగ్రహాన్ని బహూకరించి ఆలయ ప్రాంగణములో ప్రతిష్టించారు. ఈ ప్రాంగణములో ధుని ఉంది.

ఈ ఆలయంలో ప్రతి గురువారం మధ్యాహ్నం అన్నదానం జరుగుతుంది. గురుపూర్ణిమ రోజు బాబాకు అన్నాభిషేకం జరుగుతుంది. విజయదశమి రోజు బాబా సమాధిని అలంకరించి బాబాకు అనేక దీపాలతో హారతులిచ్చి పల్లకి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తారు. బాబాకు చందన అలంకారం కూడా జరుగుతుంది. నూతన ఆంగ్ల సంవత్సరాది(డిశెంబరు 31) నాడు రాత్రంతా బాబా ఆలయం తెరిచే ఉంటుంది. ప్రతి సంవత్సరం మాఘమాసంలో సాయి సత్య వ్రతాలు, సహస్ర జ్యోతిర్లింగార్చనలు, జరుగుతాయి. ఉగాది పర్వదినం రోజు బాబాకు సహస్ర కలశాభిషేకం జరుగుతుంది.