ఈ సందర్భంగా శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి మాట్లాడుతూ ఆషాడ శుద్ధ ఏకాదశి రోజున శ్రీమహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్ళి తిరిగి కార్తీక శుద్ధ ఏకాదశి రోజున మేల్కొంటారని తెలిపారు. కావున ఈ నాలుగు నెలల కాలాన్ని చాతుర్మాస్యం అంటారని, చాతుర్మాస వ్రతం ప్రాచీనకాలం నుండి ఆచరణలో ఉన్నట్లు పురాణాల ద్వారా తెలుస్తుందని వివరించారు.
అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణం
తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రతి 12 సంవత్సరాలకోసారి నిర్వహించే అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణంను వైఖానస ఆగమోక్తంగా నిర్వహించనున్నారు. గతంలో 1982, 1994, 2006లో నిర్వహంచిన విధంగానే స్వామివారి వైదిక కార్యక్రమాలకు ఎలాంటి ఆటంకం లేకుండా శాస్త్రోకంగా నిర్వహించడానికి టీటీడీ అన్ని ఏర్పాట్లు చేసింది.
శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి మాట్లాడుతూ రామానుజాచార్యులవారి వంశపారంపర్య ఆచారంలో భాగంగా వ్యాస పూర్ణిమ మరునాటి నుండి ఈ చాతుర్మాస దీక్ష సంకల్పాన్ని చేయడం విశేషమైనదిగా భావిస్తారన్నారు.
హైందవ సనాతన వైదిక ధర్మంలో ఈ చాతుర్మాస దీక్షలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. శ్రావణ, భాద్రపద, ఆశ్వయుజ, కార్తీక పవిత్ర మాసాలలో ఆచార్య పురుషులు స్నాన, జప, హోమ, వ్రత, దానాదులను లోక కల్యాణార్థం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.
అంతకుముందు శ్రీ పెద్దజీయంగారు తిరుమల బేడి ఆంజనేయస్వామివారి ఆలయం పక్కనగల జీయంగారి మఠం వద్ద నుండి శ్రీ చిన్నజీయంగారు మరియు ఇతర శిష్యబృందంతో బయల్దేరారు. తిరుమల క్షేత్ర సాంప్రదాయాన్ని పాటిస్తూ శ్రీ వరాహస్వామివారి ఆలయాన్ని, స్వామి పుష్కరిణిని సందర్శించారు. అక్కడినుంచి మంగళవాయిద్యాలతో శ్రీవారి ఆలయానికి విచ్చేశారు.
శ్రీవారి ఆలయ మహాద్వారం చెంత ఆలయ అధికారులు మర్యాదపూర్వకంగా ఆహ్వానించారు. శ్రీ జీయంగార్లు శ్రీవారిని దర్శించుకున్న తరువాత శ్రీ పెద్దజీయంగారికి మేల్చాట్ వస్త్రాన్ని, శ్రీచిన్నజీయంగారికి నూలుచాట్ వస్త్రాన్ని బహూకరించారు.
Source