అష్టకష్టాలతో తల మునుకలౌతున్న మానవజాతిని ఉద్ధరించటానికి సాక్షాత్ శ్రీహరే ఈ ఏకాదశిని ఏర్పాటు చేసాడనీ, ఈ వ్రతాన్ని నియమనిష్టలతో ఆచరించిన వారు సమస్త వ్యధల నుంచీ విముక్తి పొందగలరనీ, మరణానంతరం వైకుంఠ ప్రాప్తి లభిస్తుందనీ పద్మ పురాణంలో పేర్కొనబడింది.
తొలి ఏకాదశి నియమాలు
- ఆషాఢమాస తొలి ఏకాదశి రోజున సూర్యోదయానికి ముందే లేచి, శుచిగా స్నానమాచరించి, శ్రీహరి నిష్ఠ నియమాలతో పూజించాలి. పూజగదిని శుభ్రం చేసుకుని విష్ణుమూర్తి ప్రతిమకు లేదా పటానికి పసుపు, కుంకుమలు పెట్టి పుష్పాలతో అలంకరించుకోవాలి. తర్వాత చక్కెర పొంగలిని నైవేద్యంగా పెట్టి కర్పూర హారతివ్వాలి.
- ఇది ముఖ్యంగా రైతుల పండుగ. ఏరువాక లాగే తొలి ఏకాదశిని వేడుక చేసుకుంటారు. అతివృష్టి, అనావృష్టి లాంటి ప్రకృతి వైపరీత్యాలు చోటు చేసుకోకూడదని, పైరుకు ఏ రకమైన తెగుళ్ళు సోకకూడదని, ఇతరత్రా ఏ సమస్యలూ ఎదురవకూడదని దణ్ణం పెట్టుకుంటారు.
- తొలి ఏకాదశి పండుగ నాడు మొక్కజొన్న పేలాలను మెత్తటి పొడిగా దంచి, అందులో నూరిన బెల్లం కలిపి దేవుడికి నైవేద్యంగా సమర్పించి, ప్రసాదంగా తీసుకుంటారు. తొలి ఏకాదశినాడు ఈ పేలప్పిండిని తప్పకుండా తినాలని విశ్వసిస్తారు. తొలి ఏకాదశి పండుగ జరుపుకునే వారు కొన్ని నియమాలు పాటించాలి.
- దశమి నాడు రాత్రి నిహారులై ఉండి ఏకాదశి నాడు సూర్యోదయానికి ముందుగా కాల కృత్యాలు తీర్చుకుని శ్రీహరిని పూజించాలి.
- అసత్య మాడరాదు.
- స్త్రీ సాంగత్యం పనికి రాదు.
- కాని పనులు, దుష్ట ఆలోచనలు చేయకూడదు.
- ఆ రోజు రాత్రంతా జాగరణ చేయాలి.
- మర్నాడు అనగా ద్వాదశినాడు ఉదయాన్నే కాలకృత్యాదుల అనంతరం శ్రీహరిని పూజించి నైవేద్య తాంబూలాలు సమర్పించి భోజనం చేయాలి.
- అన్నదానం చేయడం చాలా మంచిది.
తొలి ఏకాదశి-ఉపవాసము
ముఖ్యంగా ఉపవాస దీక్షకు గల కారణాలు ఏమంటే "విష్ణువు వరం వలన అన్నంలో దాగిన పాప పురుషుడే గాక, బ్రహ్మ పాలభాగము నుంచి క్రిందబడిన చెమట బిందువు రాక్షసుడిగా అవతరించి నివాసమునకు చోటీయమని అడిగినప్పుడు, బ్రహ్మ ఏకాదశినాడు భుజించు వారి అన్నములో నివసించమని వరమీయడంతో ఇద్దరు రాక్షసులు ఆ రోజు అన్నంలో నిండి ఉంటారు గనుక ఉదరములో చేరి క్రిములుగా మారి అనారోగ్యం కలుగుతుందన్న హెచ్చరిక" మన పురాణాలు పరోక్షంగా వెల్లడిస్తున్నాయి. అందువలన ముఖ్యంగా ఉపవసించాలని చెప్పబడింది. అయితే ఉపవాసం అంటే కేవలం తినడం మానేయటం కాదు. ఆ రోజు మంచి పనులు అనగా పేదవారికి దాన, ధర్మములు చేయుట మరియు ఆ మహా విష్ణువును పూజించుట చేయవలెను.- శక్తి కొద్ది భక్తి అన్నారు పెద్దలు. అలాగే మన శక్తిని బట్టి మనం ఆ భగవంతుని పూజ గాని అందులో భాగమైన ఉపవాసం గాని చెయ్యవచ్చు. మన శక్తిని బట్టి ఈ క్రిందనివ్వబడిన నాలుగు విదానాలలో ఎలైగైన చెయ్యవచ్చు.
- రోజంతా ఏమీ తినకుండా నిష్టగా ఉండి మరుసటిరోజు సూర్యోదయమునకు ముందే లేచి స్నానం చేసి పూజ చేసుకుని ఆ తర్వాత భోజనం చేయవలెను.
- నీళ్ళు, పాలు తీసుకుని.. మరుసటిరోజు సూర్యోదయమునకు ముందే లేచి స్నానం చేసి పూజ చేసుకుని ఆ తర్వాత భోజనం చేయవలెను.
- నీళ్ళు, పాలుతో పాటు పండ్లను కూడా తీసుకుని, మరుసటిరోజు సూర్యోదయమునకు ముందే లేచి స్నానం చేసి పూజ చేసుకుని ఆ తర్వాత భోజనం చేయవలెను.
- అల్పాహారం స్వీకరించి, మరుసటిరోజు సూర్యోదయమునకు ముందే లేచి స్నానం చేసి పూజ చేసుకుని ఆ తర్వాత భోజనం చేయవలెను.