ఆషాఢ మాసం 2022: ఆషాడమాసం విశిష్టత


ఆషాడమాసం...ఈ మాసాన్ని శూన్యమాసం అంటారు. వివాహాది శుభకార్యాలు ఈ మాసంలో చేయరు. కానీ ఈ మాసం లో ఎన్నో పర్వదినాలున్నాయి. ఆషాడ శుద్ధ ఏకాదశి విష్ణు ఆరాధనకు ఎంతో ముఖ్యమైన తిథి. దీనికి తొలి ఏకాదశి అని పేరు. ఇక్కడినుంచి ఇంక ప్రతి వారానికి, ప్రతి 15 రోజులకు ఒక సారైనా ఏదో ఒక పండుగ, వ్రతం, పూజ చోటుచేసుకుంటూనేఉంటుంది.

తొలి ఏకాదశి నుంచి చాతుర్మాస్య వ్రతం ప్రారంభిస్తారు. దక్షిణాయనం తొలి ఏకాదశి మరునాటి నుంచే ప్రారంభం అవుతుంది. ఆషాడ పౌర్ణమి యే గురుపౌర్ణమి. వ్యక్తికి జ్ఞానజ్యోతిని చూపినవాడు గురువైతే లోకానికి జ్ఞానరాశిని అందించిన మహాను భావుడు వేదవ్యాసులవారు. గురుపౌర్ణమి రోజున వేదవ్యాస మహర్షిని తమ తమ గురువులలో చూసి ఆరాధించేరోజు.

ఆషాడమాసం లో బోనాలు ఆరంభం

తెలంగాణలో గ్రామదేవతలకు ప్రతి ఇంటినుంచి వైభవంగా నివేదన(బోనం) తీసుకువెళ్ళి అర్పించే బోనాలు మొదలయ్యేది ఆషాడమాసంలోనే. సమస్త జగత్తుకు పరిపాలకుడైన పూరి జగన్నాధుని రథయాత్ర జరిగేది కూడా ఈ మాసంలోనే. అమ్మలగన్నయమ్మ, జగజ్జననీ, సకలజీవులకు ఆహారం అందించిన శాకాంబరీ దేవిగా దేశమంతటా దర్శనమిచ్చేది ఆషాఢ మాసంలోనే.

ఈ మాసంలో శాకంబరీ నవరాత్రులను కూడా చేస్తారు. వైఖానస సంహిత ప్రకారం ఈ మాసంలో సప్తమాతృకలు, మహిషాసుర మర్దిని, దుర్గాదేవిని, భైరవ, వరాహ, నారసింహుల యొక్క ఆరాధన తప్పక చేయాలి. ఈ మాసము గ్రీష్మ ఋతువులో వస్తుంది. పౌర్ణమి రోజున ఉత్తరాషాడ నక్షత్రము వచ్చినందువల్ల ఈ నెలకు ఉత్తరాషాడ గా పేరు వచ్చింది అది వాడుకగా ఆషాడ మాసంగా మారిపోయింది. ఈ మాసములో వచ్చే ఆర్ధ్ర కార్తి మూలంగా విపరీతమైన వేడి పుడుతుంది. ఈ వేడే సష్టికి మూలమని ధర్మశాస్త్రం చెబుతోంది.

ఆషాడమాసంలో ఆంక్షలు  ఎందుకంటే...

వేసవి కాలం వీడి వర్షాకాలం ప్రవేశించే మాసం ఇది. వేడి వాతావరణంలో వర్షము అనేక జీవుల ఉత్పత్తికి దోహదము చేస్తుంది. భూమిపై కొత్త కొత్త జీవుల జననాకి ఈ మాసం అనువైన వాతావరణాన్నిస్తుంది. వర్షముతో నీరు కలుషితమువుతుంది. గాలి వాతావరణములో ఒక్కసారిగా మార్పు జరుగు తుంది. ఈ విశ్వములో ఒక జీవి ఇంకొక జీవిని తింటూ బ్రతుకుతాయి. అందువలన మానవులు ఎన్నో రకాల వ్యాదులకు గురవుతారు... కొత్త సూక్ష్మ జీవులు పుడుతూ మనుషులలో కొత్త జబ్బులు కలుగ జేస్తాయి. ఆషాడమాసములో కడుపులో బిడ్డకు పడకూడదంటారు.

అందుకే ఆషాడమాసం కొత్త దంపతులకు ఆంక్షలు విధిస్తారు. కొత్తకోడలు ఒకే చోట ఉండకూడదని పుట్టింటికి పంపు తారు. భర్త కూడా అత్తవారింట ఈ నెలరోజులూ అడుగు పెట్టకూడదన్నది ఆచారముగా వస్తోంది. పూర్వము వైద్యసదుపాయాలు, పారిశుధ్య పరికరాలు, మంచినీటి సౌకర్యాలు, సురక్షిత ప్రయాణం వంటి సదు పాయాలు, లేని కారణంగా కొత్తగా పెళ్ళైన భార్యాభర్తల సాంగత్యము పనికి రాదని అనాది నుంచి ఆంక్షలు విధించారు. అనారోగ్యకరమైన సంతానం కలుగ కుండా ఉండేందుకే ఇటువంటి నియమాలంటారు. ఈ మాసాన్ని శూన్యమాసంగా పిలుస్తారంటే భయా లను కలిగించేందుకు కాదు పైన పేర్కొన్న శాస్త్రీయ కారణాలవల్లే ఈ మాసాన్ని శూన్యమాసంగా ప్రకటించారు పెద్దలు.

ఆషాడమాసం లో తొలకరి పలకరింపు...

ఈ మాసంలో తొలకరి మొదలై వర్షాలు పడతాయి. రైతులు వ్యవసాయ పను లపై దృష్టి సారిస్తారు. అంతవరకూ మూలన పడేసిన వ్యవసాయ పనిముట్ల ను వెలికి తీసి పొలంబాట పడతారు. వర్షాలు వేగం పుంజుకున్నాక పొలాన్ని దుక్కిదున్నేందుకు వీలుగా తమ సాగు భూములను సిద్ధం చేసుకునే కాలం ఇది. అంతవరకూ వేసవి తాపంతో అల్లాడిన ప్రజలకు కాస్త ఊరట కలిగించే మాసం కూడాను. అప్పటి వరకూ నమెదవుతున్న 42 నుంచి 45 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు క్రమేపీ 35 నుంచి 32 డిగ్రీలకు పడిపోతాయి.