సిరులతల్లి తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి తెప్పోత్సవాలు శనివారం వైభవంగా ప్రారంభమయ్యాయి. మొదటిరోజు శ్రీ రుక్మిణి, సత్యభామ సమేత శ్రీ కృష్ణస్వామివారు పద్మసరోవరంలో తెప్పపై మూడు చుట్లు విహరించి భక్తులను అనుగ్రహించారు.
ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చన, నిత్యార్చన, నిర్వహించారు. మధ్యాహ్నం 3.00 నుండి 4.00 గంటల వరకు శ్రీ కృష్ణస్వామివారి ముఖ మండపంలో శ్రీ కృష్ణస్వామివారికి వేడుకగా అభిషేకం నిర్వహించారు. ఇందులోభాగంగా పాలు, పెరుగు, తేనె, చందనం, సుగంద్ర ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేశారు.
సాయంత్రం 6.30 గంటలకు స్వామి, అమ్మవారి ఉత్సవమూర్తులను పద్మపుష్కరిణి వద్దకు వేంచేపు చేస్తారు. సాయంత్రం 6.30 నుండి రాత్రి 7.30 గంటల వరకు తెప్పోత్సవం వైభవంగా జరిగింది. అనంతరం శ్రీ కృష్ణస్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులను కటాక్షించారు.
ఈ సందర్భంగా టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్ మాట్లాడుతూ అమ్మవారి తెప్పొత్సవాలు వైభవంగా ప్రారంభమయినట్లు తెలిపారు. ఇందులో భాగంగా శనివారం సాయంత్రం శ్రీ రుక్మిణి, సత్యభామ సమేత శ్రీ కృష్ణస్వామివారు తెప్పలపై విహరించి భక్తులకు కనువిందు చేశారన్నారు. అదేవిధంగా జూన్ 24న శ్రీసుందరరాజస్వామి 3 ప్రదక్షిణలు, జూన్ 25న శ్రీపద్మావతి అమ్మవారు 3 ప్రదక్షిణలు, జూన్ 26న శ్రీపద్మావతి అమ్మవారు 5 ప్రదక్షిణలు, జూన్ 27న శ్రీపద్మావతి అమ్మవారు 7 ప్రదక్షిణలు తెప్పలపై విహరిస్తారని తెలిపారు.
ఈ సందర్భంగా చివరి మూడు రోజులు పద్మసరోవరంలోని నీరాడ మండపంలో మధ్యాహ్నం 3.30 గంటలకు అమ్మవారికి స్నపనతిరుమంజనం వైభవంగా నిర్వహించనున్నట్లు తెలియచేశారు. జూన్ 26వ తేదీ రాత్రి శ్రీ పద్మావతి అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైన గజవాహనంపై, జూన్ 27న గరుడ వాహనంపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులకు దర్శనమిస్తారని వివరించారు. భక్తులు పెద్దసంఖ్యలో తెప్పొత్సవాలలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని ఆయన కోరారు.
Source