వేణుగోపాలస్వామివారి బ్రహ్మోత్సవాల పోస్టర్లు ఆవిష్కరణ

తిరుమల తిరుపతి దేవస్థానానికి అనుబంధంగా ఉన్న కార్వేటినగరములోని శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయ ధ్వజస్తంభ ప్రతిష్టా సంప్రోక్షణము, నవాహ్నిక వార్షిక బ్రహ్మోత్సవాల పోస్టర్లను టిటిడి తిరుపతి సంయుక్త కార్యనిర్వహణాధికారి శ్రీ పోల భాస్కర్‌ గురువారం ఆవిష్కరించారు. తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలోని ఆయన కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది.

ఈ సందర్భంగా తిరుపతి జెఈవో మాట్లాడుతూ శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత శ్రీవేణుగోపాలస్వామివారి ఆలయ ధ్వజస్తంభ ప్రతిష్టా సంప్రోక్షణము జూన్‌ 29 నుండి జూలై 1వ తేదీ వరకు శాస్త్రోక్తంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. అదేవిధంగా స్వామివారి నవాహ్నిక వార్షిక బ్రహ్మోత్సవాలు జూలై 2 నుండి 10వ తేదీ వరకు వైభవంగా నిర్వహిస్తామన్నారు. అందులో భాగంగా జూన్‌ 26వ తేదీ మంగళవారం కోయల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం, జూలై 1వ తేదీ సాయంత్రం అంకురార్పణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయని తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని కోరారు.

venugopalaswamy-temple

బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు


తేదీ                                   ఉదయం                                   సాయంత్రం

  • 02-07-2018(సోమవారం) ధ్వజారోహణం(మిధున లగ్నం) పెద్దశేష వాహనం

  • 03-07-2018(మంగళవారం) చిన్నశేష వాహనం హంస వాహనం

  • 04-07-2018(బుధవారం) సింహ వాహనం ముత్యపుపందిరి వాహనం

  • 05-07-2018(గురువారం) కల్పవృక్ష వాహనం కల్యాణోత్సవం, సర్వభూపాల వాహనం

  • 06-07-2018(శుక్రవారం) మోహినీ అవతారం గరుడ వాహనం

  • 07-07-2018(శనివారం) హనుమంత వాహనం గజ వాహనం

  • 08-07-2018(ఆదివారం) సూర్యప్రభ వాహనం చంద్రప్రభ వాహనం

  • 09-07-2018(సోమవారం) రథోత్సవం అశ్వవాహనం

  • 10-07-2018(మంగళవారం) చక్రస్నానం ధ్వజావరోహణం


బ్రహ్మోత్సవాల్లో ఉదయం 7.30 నుండి 9.30 గంటల వరకు, రాత్రి 7.00 నుండి 9.00 గంటల వరకు వాహనసేవలు జరుగనున్నాయి. జూలై 5వ తేదీ సాయంత్రం 5.30 నుండి 6.30 గంటల వరకు స్వామివారి కల్యాణోత్సవం వైభవంగా నిర్వహించనున్నారు. రూ.750/- చెల్లించి గృహస్తులు(ఇద్దరు) ఈ కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, ఒక లడ్డు అన్నప్రసాదాలు బహుమానంగా అందజేస్తారు. జూలై 11వ తేదీన మధ్యాహ్నం 2.30 నుంచి 4.30 గంటల వరకు స్వామి, అమ్మవార్లకు వివిధ రకాల పుష్పాలతో పుష్పయాగం వైభవంగా నిర్వహించనున్నారు.

ఈ సందర్భంగా టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌, దాససాహిత్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజూ ఆధ్యాత్మిక, భక్తి సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు, భజనలు, కోలాటాలు నిర్వహించనున్నారు.

Source