అంగరంగ వైభవంగా శ్రీ సీతారాముల కల్యాణం

ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామాలయంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల్లో భాగంగా  మార్చి 30 వ తేదీ శుక్రవారం  శ్రీసీతారాముల కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. రాత్రి 8 నుండి 10 గంటల వరకు కల్యాణాన్ని ఆల‌య అర్చకుల ఆధ్వ‌ర్యంలో శాస్త్రోక్తంగా నిర్వహించారు.

కల్యాణోత్సవంలో ప్రధాన ఘట్టాలు ఇలా ఉన్నాయి

మొదట అర్చకులు భగవత్‌ ప్రార్థన, విష్వక్సేన ప్రార్థన , సభ ప్రార్థన, పరిషత్‌ ప్రార్థన, గురుపరంపర ప్రార్థన, దైవప్రార్థన చేశారు. సంకల్పం అనంతరం విష్వక్సేనారాధన, వాసుదేవ పుణ్యహవచనం, రక్షాబంధనం, యజ్ఞోపవీత ధారణ జరిగింది. ఆ తరువాత వస్త్రసమర్పణ, మధుపర్కం, ప్రవరాలు, మహాసంకల్పం చేశారు. అనంతరం కన్యాదానం జరిగింది.

ఆ వెంటనే మండలాష్టకములు, చూర్ణిక, జీలకర్ర బెల్లం, మాంగళ్యపూజ, అక్షతారోపనం, బ్రహ్మగ్రంథి వ్యాఖ్యానం, ఫలప్రదానం, అనుగ్రహం, మాలపరివర్తన చేశారు. చివరగా వేద విన్నపము, మహదాశీర్వాదంతో శ్రీ సీతారాముల కల్యాణం ముగిసింది. కల్యాణం ముగిసిన అనంతరం భక్తులందరికీ ముత్యంతో కూడిన తలంబ్రాలను టిటిడి అందజేసింది.

వైభవంగా శ్రీ సీతారాముల కల్యాణం


ఏకశిలా నగరంగా ప్రసిద్ధి చెందిన ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామాలయాన్ని ఆద‌ర్శ‌నీయ పుణ్య‌క్షేత్రంగా తీర్చిదిద్దుతామ‌ని రాష్ట్ర ముఖ్యమంత్రి  నారా చంద్రబాబునాయుడు ఉద్ఘాటించారు. ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామాలయంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీసీతారాముల కల్యాణాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను ఆయన సమర్పించారు.

sobhayatra

వైభవంగా శ్రీ సీతారాముల ఉత్సవర్ల శోభాయాత్ర


ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామాలయం చెంత కల్యాణోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం సాయంత్రం శ్రీ సీతారాముల ఉత్సవమూర్తుల శోభాయాత్ర కల్యాణవేదిక వరకు వైభవంగా జరిగింది. మంగళవాయిద్యాలు, భజనలు, కోలాటాల నడుమ శోభాయాత్ర వేడుకగా సాగింది.

ఎదుర్కోలు ఉత్సవం


ఒంటిమిట్టలోని కల్యాణవేదిక వద్ద సాయంత్రం ఎదుర్కోలు ఉత్సవం వైభవంగా జరిగింది. స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఎదురెదురుగా ఉంచి పూలమాలలు మార్చుకునే ప్రక్రియనే ఎదుర్కోలు ఉత్సవం అంటారు.

ఆలరించిన భక్తి సంగీతం


శ్రీ సీతారాముల కల్యాణోత్సవం సందర్భంగా కల్యాణవేదిక వద్ద  సాయంత్రం శ్రీమతి మండా సుధారాణి, శ్రీమతి వందన, శ్రీ చైతన్య సోదరులు గాత్ర సంగీత కార్యక్రమం నిర్వహించారు. శ్రీ దీవి హయగ్రీవాచార్యులు, శ్రీ కడిమెళ్ల వరప్రసాద్‌, శ్రీబి.వి.నరసింహదీక్షితులు కల్యాణోత్సవానికి ప్రత్యక్ష వ్యాఖ్యానం చేశారు. శ్రీవేంకటేశ్వర భక్తి ఛానల్‌లో శ్రీ సీతారాముల కల్యాణాన్ని ప్రత్యక్ష ప్రసారం చేశారు.

Source