తిరుపతిలో ఘనంగా వెంగమాంబ 288వ జయంతి ఉత్సవాలు ప్రారంభం

మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ శ్రీవారి ఆంతరంగిక భక్త శిరోమణిగా గుర్తింపు పొందారని తరిగొండ వెంగమాంబ వాఙ్మయ ప్రాజెక్టు సమన్వయాధికారి ఆచార్య కె.జె.కృష్ణమూర్తి తెలియజేశారు. తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో శుక్రవారం తరిగొండ వెంగమాంబ 288వ జయంతి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.

సాహితీ సదస్సుకు అధ్యక్షత వహించిన ఆచార్య కె.జె.కృష్ణమూర్తి మాట్లాడుతూ వెంగమాంబ తన జన్మస్థలమైన తరిగొండలో 5, తిరుమలలో 13 కలిపి మొత్తం 18 రచనల ద్వారా స్వామివారి కీర్తిని ఇనుమడింపచేశారని తెలిపారు. వీటిలో 1600 గద్య పద్యాలతో కూడిన ‘వేంకటాచల మహత్యం’ విశిష్టమైందన్నారు. భారత, భాగవత, రామాయణాల తరహాలో వేంకటాచల మహత్యం అంతటి పవిత్రమైందని తెలిపారు. సంకీర్తనల్లోని భావాన్ని ప్రజల బాణీలోనే తెలియజేసిన ఘనత అన్నమయ్య, వెంగమాంబకు దక్కిందన్నారు. ఈమె వ్యక్తిగా, సంస్కర్తగా, యోగినిగా, కవయిత్రిగా శ్రీవారి భక్తితత్వాన్ని ప్రచారం చేశారని వివరించారు.

వెంగమాంబ విగ్రహానికి పుష్పాంజలి


తరిగొండ వెంగమాంబ జయంతి సందర్భంగా ఉదయం 9.00 గంటలకు తిరుపతిలోని ఎంఆర్‌.పల్లి సర్కిల్‌ వద్ద గల వెంగమాంబ విగ్రహానికి పుష్పాంజలి సమర్పించారు.

Source