శ్రీమాన్ తాళ్లపాక అన్నమాచార్యుల 515వ వర్ధంతి మహోత్సవాల్లో చివరి రోజైన శనివారం తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో శ్రీ గోవిందరాజస్వామివారి ఆస్థానం ఘనంగా జరిగింది. భక్తుడి చెంతకు భగవంతుడు రావడం అనే ఆర్యోక్తికి తార్కానంగా శ్రీ వేంకటేశ్వరస్వామికి పరమభక్తుడైన అన్నమాచార్యుడు వెలసిన అన్నమాచార్య కళామందిరానికి శ్రీ గోవిందరాజస్వామి ఉత్సవర్లు వేంచేయడం సంప్రదాయంగా కొనసాగుతోంది. అనంతరం గోవిందరాజస్వామివారిపై అన్నమయ్య రచించిన సంకీర్తనలను ప్రాజెక్టు కళాకారులు సుమధురంగా ఆలపించారు.
అంతకుముందు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి ఉత్సవమూర్తులను ఆలయం నుండి ఊరేగింపుగా నాలుగు కాళ్ల మండపం, తీర్థకట్టవీధి మీదుగా అన్నమాచార్య కళామందిరానికి తీసుకొచ్చారు. ఆస్థానం అనంతరం తిరిగి ఉత్సవమూర్తులను శ్రీగోవిందరాజస్వామివారి ఆలయానికి తీసుకెళ్లారు. అనంతరం చెన్నైకి చెందిన కుమారి ఎం.పి.శృతిరవళి బృందం గాత్ర సంగీత సభ నిర్వహించారు. అదేవిధంగా, తిరుపతికి చెందిన శ్రీకె.చంద్రశేఖర్ భాగవతార్ హరికథ పారాయణం చేశారు.
సాయంత్రం 6 నుండి 7 గంటల వరకు టిటిడి ఆస్థాన విద్వాంసులు శ్రీగరిమెళ్ళ బాలకృష్ణప్రసాద్ గాత్ర సంగీతం, రాత్రి 7 నుండి 8.30 గంటల వరకు తిరుపతికి చెందిన శ్రీమతి బి.కేశవి బృందం నృత్య కార్యక్రమం జరిగింది.
Source