టిటిడి అనుబంధ ఆలయమైన చంద్రగిరిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు మార్చి 27 నుండి ఏప్రిల్ 4వ తేదీ వరకు వైభవంగా జరగనున్నాయి. అందులో భాగంగా మార్చి 26వ తేదీ సాయంత్రం 6.00 గంటలకు అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి.
ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించనున్నారు. మార్చి 27వ తేదీ ఉదయం 5.00 నుండి 6.00 గంటల వరకు మూలవర్లకు అభిషేకం, ఉదయం 6.30 నుండి 7.30 గంటల వరకు ఉత్సవర్లకు అభిషేకం, ఉదయం 8.00 నుండి 9.00 గంటల వరకు ధ్వజారోహణం నిర్వహిస్తారు. కాగా సాయంత్రం 6.00 నుండి 7.00 గంటల వరకు ఊంజల్‌సేవ వైభవంగా జరుగనుంది.
మార్చి 30వ తేదీ ఉదయం 5.00 నుండి 6.00 గంటల వరకు మూలవర్లకు అభిషేకం, రాత్రి 7.00 నుండి 8.00 గంటల వరకు శ్రీ కోదండరామస్వామివారు హనుమంత వాహనంపై భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఏప్రిల్ 1వ తేదీ సాయంత్రం 5.00 నుండి 7.00 గంటల వరకు శ్రీ సీతారాముల కల్యాణోత్సవం, రాత్రి 8.00 నుండి 9.00 గంటల వరకు గరుడ వాహనంపై స్వామివారు ఉరేగుతూ భక్తులను కటాక్షించనున్నారు.
ఏప్రిల్ 3వ తేదీ ఉదయం 6.30 నుండి 7.30 గంటల వరకు ఉత్సవర్లకు అభిషేకం, సాయంత్రం 6.00 నుండి 7.00 గంటల వరకు ఊంజలసజేవ నిర్వహిస్తారు. ఏప్రిల్ 4వ తేదీ ఉదయం 9.00 నుండి 10.00 గంటల వరకు వసంతోత్సవం, ఉదయం 10.30 నుండి 11.45 గంటల వరకు చక్రస్నానం వైభవంగా నిర్వహించనున్నారు. రాత్రి 8.00 గంటలకు ధ్వజావరోహణముతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయ.
ఏప్రిల్ 5వ తేదీ సాయంత్రం 5.00 నుండి 7.00 గంటల వరకు శ్రీ రామపట్టాభిషేకం వైభవంగా నిర్వహించనున్నారు.
బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయంలో మార్చి 28, 29, 31 మరియు ఏప్రిల్ 2వ తేదీలలో సాయంత్రం 6.00 నుండి 7.00 గంటల వరకు స్వామి, అమ్మవార్లకు ఊంజలసేవ వైభవంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్, దాససాహిత్య ప్రాజెక్టు, అన్నమాచార్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో హరికథలు, భజనలు, సంగీత కచేరీలు నిర్వహించనున్నారు.
Source