తిరుమలలో ధనుర్మాస వైభవం



ఈ ధనుర్మాస ఉత్సవాలను దేశ వ్యాప్తంగా విష్ణు దేవాలయాల్లో ఘనంగా నిర్వహిస్తారు. డిసెంబరు 16నుంచి ధనుర్మాసం ప్రారంభం అవుతున్న నేపధ్యంలో 108 దివ్య వైష్ణవక్షేత్రాలలో ప్రధాన మైన తిరుమల లోనూ ప్రత్యేకంగా ఉత్సవాలు నిర్వహించేందుకు సంసిద్ధులవుతున్నారు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు.

ధనుర్మాసం సందర్భంగా ప్రత్యేక పూజలకు తిరుమల శ్రీవారి ఆలయం అంగరంగ వైభవంగా ముస్తాబవుతుంది. ధనుర్మాసం నెల రోజులపాటూ శ్రీవారికి చేసే సుప్రభాత సేవను రద్దు చేసి ఆ స్ధానంలో తిరుప్పావై పఠిస్తారు అర్చకులు. గోదాదేవి తనను ద్వాపర యుగం నాటి గోపికగా భావించి పాడిన 30 పాశురాలను ఈ నెల రోజుల పాటూ పఠిస్తారు. రోజుకొక పాశురం చొప్పున ఈ తిరుప్పావై పఠనం తిరుమల శ్రీవారి ఆలయంలో జరుగుతుంది.

నిత్యం వేదపారాయణ చేసే అర్చకులే స్వామివారికి సుప్ర భాతాన్ని నిర్వహిస్తారు. అయితే ఈ ధనుర్మాసం మొత్తం జీయంగార్లు 30 తిరుప్పావై పాశురాలను స్వామివారికి చదివి వినిపిస్తారు. అనంతరం స్వామివారికి తోమాలను సమర్పించి, సహస్రనామార్చన చేస్తారు. ఆలయ పూజారులు. అనంతరం యధావిధిగా అన్ని పూజలు నిర్వహిస్తారు.


ఇక ఈ మాసం మొత్తం స్వామివారికి ప్రత్యేక ప్రసాదాలను నివేదిస్తారు. పెళ్లి కావాల్సిన వారు ఈ మాసంలో స్వామివారి కళ్యాణాన్ని వీక్షించి ఈ అక్షతలను తాము శిరస్సున ధరిస్తే ఖచ్చితంగా ఏడాదిలోనే వివాహం అవుతుందని భక్తుల విశ్వాసం అందుకే ఈ మాసంలో పెద్ద ఎత్తున భక్తులు తిరుమల వస్తుంటారు.