టిటిడి హిందూధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో నవంబరు 29, 30వ తేదీల్లో వార్షిక గీతాజయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని హిందూ ధర్మప్రచార పరిషత్ కేంద్రాలతో పాటు చెన్నై, బెంగళూరు, గురువాయూరు కేంద్రాల్లోనూ గీతాజయంతి ఉత్సవాలు జరుగనున్నాయి.
అన్నమాచార్య కళామందిరంలో
నవంబరు 29న ఉదయం 9 నుంచి 10 గంటల వరకు గీతాపారాయణం చేస్తారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు 6 నుంచి 9వ తరగతి వరకు చదువుతున్న బాలబాలికలకు భగవద్గీతపై కంఠస్తం పోటీలు నిర్వహిస్తారు. సాయంత్రం 5.30 నుంచి 6 గంటల వరకు వేదపారాయణం, సాయంత్రం 6 నుంచి 7.15 గంటల వరకు ధార్మికప్రబోధం, రాత్రి 7.15 నుంచి 8.30 గంటల వరకు అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులతో సంగీత కార్యక్రమం నిర్వహిస్తారు.నవంబరు 30న సాయంత్రం 5 నుంచి 5.30 గంటల వరకు వేదపారాయణం, సాయంత్రం 5.30 నుంచి 6.30 గంటల వరకు విజేతలకు బహుమతి ప్రదానం, సాయంత్రం 6.30 నుంచి రాత్రి 7.30 గంటల వరకు ప్రముఖ పండితులతో గీతాసందేశంపై చర్చాగోష్టి, రాత్రి 7.30 నుంచి 8.30 గంటల వరకు ఎస్వీ సంగీత కళాశాల ఆధ్వర్యంలో నృత్య కార్యక్రమం నిర్వహిస్తారు.