మారుమూల ప్రాంతాల్లోని ఆలయాల్లో గల అర్చకులు సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్లే రథసారథులని టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్ పేర్కొన్నారు. తిరుపతిలోని శ్వేత భవనంలో టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో శనివారం హరిజన, గిరిజన, మత్స్యకారులకు రెండో దశ అర్చక శిక్షణ కార్యక్రమం ప్రారంభమైంది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జెఈవో మాట్లాడుతూ రాష్ట్ర దేవాదాయ శాఖ ఆధ్వర్యంలోని హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్టు తరఫున మారుమూల ప్రాంతాల్లో 500 ఆలయాల నిర్మాణం జరుగుతోందని, ఇందుకోసం టిటిడి ఆర్థికసాయం అందిస్తోందని తెలిపారు. ఇప్పటికి దాదాపు 100 ఆలయాల నిర్మాణం పూర్తయిందని, వీటిలో అర్చకత్వం చేపట్టేందుకు ఆయా ప్రాంతాల్లోని వారిని ఎంపిక చేసి అర్చక శిక్షణ ఇస్తున్నామని వివరించారు.
ఒక్కో బ్యాచ్‌లో 30 మంది చొప్పున 15 రోజులు శిక్షణ ఇస్తామన్నారు. ఇందులో ధర్మం, దేవాలయం, అర్చకత్వం, అర్చకుడు సమాజ భాగస్వామ్యం అనే అంశాలపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పిస్తామని తెలిపారు. దేవాలయ వ్యవస్థ భారతీయ సంస్కృతిలో ఒక భాగమని, అర్చకుడు వృత్తి ధర్మాన్ని పాటిస్తూ ధర్మాచరణ వైపు ప్రజలను నడిపించాలని జెఈవో కోరారు.
ముఖ్యంగా యువతను భక్తిమార్గం వైపు మళ్లించాలని, ఆధ్యాత్మిక చింతన లేకపోతే జీవితంలో ఎదురయ్యే ఒడిదుడుకులను తట్టుకోలేరని అన్నారు. పురాణయుక్తంగా అర్చకత్వం చేసేందుకు వర్గాలతో సంబంధం లేకుండా ఎవరైనా అర్హులేనని చెప్పారు. జిల్లా ధర్మప్రచార మండళ్ల ద్వారానూ కొంతమందిని ఎంపిక చేసి అర్చక శిక్షణ ఇస్తామన్నారు.