శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసే లక్షలాది మంది భక్తులకు ఏనాడు ఏ కొరతా రాకుండా తి.తి.దే నిరంతరం అన్నప్రసాద సేవలు ఘన విజయం సాధించడానికి తోడ్పడుతున్న కూరగాయల దాతల సేవలు అమూల్యమైనవి, అపురూపమైనవి అని తిరుమల జె.ఇ.ఓ శ్రీ కె.ఎస్.శ్రీనివాసరాజు కొనియాడారు.
మంగళవారంనాడు తిరుమలలోని అన్నమయ్య భవనంలో త్వరలో రానున్న బ్రహ్మూెత్సవాల సందర్భంగా కూరగాయల దాతలతో మర్యాదపూర్వకంగా సమావేశమైనారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1985 ఏప్రిల్ 6వ తేది కేవలం 2000 మందితో ప్రారంభమైన తి.తి.దే అన్నప్రసాద సేవ ఈ మూడు దశాబ్దాల పైచిలుకు ప్రస్థానంలో రోజుకు లక్షమందికి తగ్గకుండా అన్నప్రసాద సేవలందించడం అద్వితీయమన్నారు.
ప్రారంభదశలో దర్శనానికి వచ్చిన భక్తులకు మాత్రమే టోకెన్‌లు అందించి వారికి అన్నప్రసాదులు ఇచ్చేవారని, కాని నేడు అసంఖ్యాకంగా భక్తులకు తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో మాత్రమే కాకుండా మాధవ నిలయం, క్యూలైన్లు, కంపార్టుమెంట్లలలో కూడా భక్తులకు అన్నప్రసాద వితరణ చేయడం తి.తి.దే కే సాధ్యమన్నారు.
భక్తుల రద్దీ అధికంగా ఉన్న సమయంలో క్యూలైన్లు వెలుపలకి వచ్చినప్పుడు కూడా తి.తి.దే ఎవరికీ లేదు అనకుండా భక్తులపాలిట అక్షయపాత్ర లాగా అన్నప్రసాద వితరణ చేస్తోందన్నారు.
భక్తులు కూడా తి.తి.దే చేస్తోన్న అన్నప్రసాద వితరణని వేనోళ్ళ శ్లాఘిస్తున్నారన్నారు. తి.తి.దే నిరంతరం సాగిస్తున్న ఈ అన్నప్రసాదం వితరణ వెనుక ప్రధాన భూమికను పోషిస్తున్న కూరగాయల దాతలను ఆయన పేరుపేరునా ప్రశంసించారు. అనంతరం వారిని శ్రీవారి ప్రసాదలతో సత్కరించారు.