శ్రీవారి దర్శనార్థం విచ్చేసే భక్తులకు మరింత ఉన్నతమైన ప్రమాణాలతో అత్యుత్తమ సేవలు అందించేందుకు శ్రీవారి సేవ విభాగంలో నూతన మార్పులు తీసుకురానున్నట్టు టిటిడి తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్.శ్రీనివాసరాజు తెలిపారు. తిరుమలలోని గోకులం విశ్రాంతి గృహంలో గల సమావేశ మందిరంలో శుక్రవారం శ్రీవారి సేవ విభాగంపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
అనంతరం జెఈవో మీడియాతో మాట్లాడుతూ సంవత్సరం పొడవునా శ్రీవారి సేవకులు తమ తోటి భక్తులకు ఇతోధిక సేవలందిస్తున్నారని తెలిపారు. సాధారణ రోజుల్లో రోజుకు 1500 మంది, విశేష పర్వదినాల సమయంలో 3 వేల మందికిపైగా సేవకులు టిటిడిలోని వివిధ విభాగాల్లో విశేష సేవలు చేస్తున్నారని వివరించారు. పది మందికి తక్కువ కాకుండా బృందంగా ఏర్పడి ఆన్‌లైన్ ద్వారాగానీ, ఉత్తరాల ద్వారాగానీ సేవకు నమోదు చేసుకోవచ్చన్నారు. శ్రీవారి సేవకు అనుబంధంగా 2012, ఆగస్టు 17న పరకామణిసేవ, 2013, జనవరి 13న లడ్డూ ప్రసాద సేవలను ప్రారంభించినట్టు తెలిపారు. తిరుపతిలోని స్థానికాలయాల్లోనూ శ్రీవారి సేవకులు సేవలందిస్తున్నట్టు చెప్పారు.
టిటిడి అవసరాలకు తగ్గట్టు సేవకులు రావాల్సి ఉందని, భవిష్యత్తులో శ్రీవారి సేవను మరింత ఉన్నతంగా తీర్చిదిద్దుతామని జెఈవో తెలిపారు. ఆయా విభాగాల్లో శ్రీవారి సేవకులు ఎంతమంది అవసరమో గుర్తించి ఆ మేరకు కేటాయిస్తున్నట్టు చెప్పారు. టిటిడి ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ ఆదేశాల మేరకు త్వరలో శ్రీవారి ఆలయంలో ‘ఆలయ స్వచ్ఛ సేవ'(ఫ్లోర్ క్లీనింగ్)ను ప్రవేశపెట్టేందుకు యోచిస్తున్నట్టు తెలిపారు.
శ్రీవారి సేవకుల నుంచి ముందుగా అంగీకారం తీసుకుని ఈ సేవకు వినియోగిస్తామని, ఆరోగ్యశాఖాధికారిణి ప్రత్యక్ష పర్యవేక్షణలో వీరు ఆలయంలో సేవలు అందించాల్సి ఉంటుందని తెలియజేశారు. మరో మూడు నెలల్లో నూతన శ్రీవారి సేవాసదన్ భవనాన్ని ప్రారంభించి, సేవకులకు మరింత మెరుగైన బస కల్పిస్తామని, శిక్షణ కార్యక్రమాలు మెరుగుపరుస్తామని వివరించారు.
ఈ సమావేశంలో టిటిడి డెప్యూటీ ఈవోలు శ్రీ కోదండరామారావు, శ్రీ వేణుగోపాల్, శ్రీవెంకటయ్య, శ్రీమతి ఝాన్సీ, శ్రీ హరీంద్రనాథ్, ప్రజాసంబంధాల అధికారి డా.టి.రవి, విజివో శ్రీ రవీంద్రారెడ్డి, ఆరోగ్యశాఖాధికారి డా.శర్మిష్ట, క్యాటరింగ్ అధికారి శ్రీ జిఎల్‌ఎన్.శాస్త్రి, గార్డెన్ సూపరింటెండెంట్ శ్రీ శ్రీనివాస్ ఇతర అధికారులు పాల్గొన్నారు.
తిరుపతిలో శ్రీవారి సేవకుల నమోదు ప్రారంభం
తిరుపతిలోని విష్ణునివాసంలో గల శ్రీవారి సేవ కార్యాలయంలో శుక్రవారం నుంచి కంప్యూటర్ ద్వారా శ్రీవారి సేవకుల నమోదు ప్రక్రియ ప్రారంభమైంది. ఇదివరకు సేవకుల వివరాలను మాన్యువల్‌గా నమోదు చేసేవారు. తిరుపతిలో సేవలందించిన శ్రీవారి సేవకులు తిరుమలకు వెళ్లిన తరువాత తిరిగి నమోదు చేసుకునే అవసరం లేకుండా ఈ మేరకు చర్యలు తీసుకున్నారు.